ఎత్తర ట్రోఫీ..నాల్గోసారి

– వరుసగా 4వ సారి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సొంతం
– జీవం లేని పిచ్‌పై అహ్మదాబాద్‌ టెస్టు డ్రా
– 2-1తో టెస్టు సిరీస్‌ భారత్‌ కైవసం
– డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్‌ ఇండియా
1,2,3,4.. వరుసగా నాల్గోసారి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ టీమ్‌ ఇండియా సొంతమైంది. టెస్టు క్రికెట్‌ను శాసించిన కంగారూలపై ఎదురులేని ప్రదర్శనలతో దుమ్మురేపిన టీమ్‌ ఇండియా.. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. స్పందన లేని అహ్మదాబాద్‌ పిచ్‌పై నాల్గో టెస్టు డ్రాగా ముగియగా ఆతిథ్య జట్టు సిరీస్‌ విజయం సాధించింది. నాగ్‌పూర్‌, న్యూఢిల్లీ టెస్టుల్లో భారత్‌ గెలుపొందగా.. ఇండోర్‌లో ఆసీస్‌ విజయం సాధించి సిరీస్‌పై ఆసక్తి రేపింది. భారీ స్కోర్లు నమోదైన మొతెరాలో ఫలితం రాలేదు. 2016-17, 2018-19, 2020-21, 2022-23లలో భారత్‌ 2-1 తేడాతోనే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2016-17, 2022-23 సిరీస్‌లు భారత్‌లో ఆడగా.. 2018-19, 2020-21 సిరీస్‌లను ఆసీస్‌ గడ్డపై నెగ్గిన టీమ్‌ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్పిన్‌ పిచ్‌లపై ద్వైపాక్షిక టెస్టు సమరం ముగియగా.. ఈ ఏడాది జూన్‌ 7-11న లండన్‌లోని ది ఓవల్‌ మైదానంలో పచ్చిక పిచ్‌పై భారత్‌, ఆస్ట్రేలియా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం తలపడనున్నాయి.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
భారీ స్కోర్లు నమోదైన అహ్మదాబాద్‌ టెస్టు చివరకు డ్రాగా ముగిసింది. ఐదు రోజుల్లో మూడు ఇన్నింగ్స్‌లైనా ముగియకపోవటంతో చివరి సెషన్‌ డ్రింక్స్‌ విరామం అనంతరం ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. అహ్మదాబాద్‌ టెస్టు డ్రా కావటంతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2-1తో ఆతిథ్య భారత్‌ గూటికి చేరుకుంది. తొలుత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు చేసింది. ఉస్మాన్‌ ఖవాజ (180), కామెరూన్‌ గ్రీన్‌ (114) సెంచరీలు సాధించారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (6/91) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగుల భారీ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సొంతం చేసుకుంది. విరాట్‌ కోహ్లి (186) మూడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ టెస్టు సెంచరీ బాదగా, యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (128) స్వదేశంలో తొలి టెస్టు శతకం నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 175/2తో ఉండగా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ డిక్లరేషన్‌ ప్రకటించి డ్రాకు అంగీకారం తెలిపాడు. మొతెరాలో శతక మోత మోగించిన విరాట్‌ కోహ్లి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ 25 వికెట్లు సహా 86 పరుగులు చేయగా..రవీంద్ర జడేజా 135 పరుగులు సహా 22 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌, జడేజా సంయుక్తంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును అందుకున్నారు. లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ చేతుల మీదుగా టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని అందుకున్నాడు.
సహకరించని పిచ్‌పై..! :
ఓవర్‌నైట్‌ స్కోరు 3/0తో ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు తొలి ప్రాధాన్యం తొలి ఇన్నింగ్స్‌ లోటు పూడ్చటం. ఐదో రోజు పిచ్‌పై పగుళ్లు ఏర్పడి స్పిన్‌కు ఏమాత్రం సహకరించినా.. అనూహ్య పరాభవం తప్పదని కంగారూ శిబిరం గ్రహించింది. దీంతో తొలుత ఆ జట్టు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటును పూడ్చటంపై దృష్టి నిలిపింది. ఉదయం సెషన్‌ ఆరంభంలోనే నైట్‌ వాచ్‌మన్‌ మాథ్యూ కునేమాన్‌ (3)ను అవుట్‌ చేసిన అశ్విన్‌.. ఆటను రక్తికట్టించాడు. బంతి టర్న్‌ అవుతుందనే భావనతో అటు ఆసీస్‌, ఇటు భారత ఆటగాళ్లు కాస్త ఉత్కంఠకు లోనయ్యారు. కానీ పిచ్‌ నుంచి బౌలర్లకు ఎటువంటి సహకారం లభించలేదు. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (90, 163 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్నస్‌ లబుషేన్‌ (63 నాటౌట్‌, 213 బంతుల్లో 7 ఫోర్లు) రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించారు. ఉదయం సెషన్లో వికెట్‌ నష్టానికి 70 పరుగులు జోడించిన ఆస్ట్రేలియా.. లంచ్‌ విరామం అనంతరం కాస్త జోరు పెంచింది. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ టాప్‌ గేర్‌లో బ్యాటింగ్‌ చేశాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 112 బంతుల్లోనే అర్థ సెంచరీ ముగించాడు. తొలి ఇన్నింగ్స్‌ లోటు అధిగమించిన అనంతరం ఆస్ట్రేలియా స్వేచ్ఛగా ఆడింది. మార్నస్‌ లబుషేన్‌ సైతం ఆరు ఫోర్లతో 150 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. శతకం దిశగా సాగుతున్న ట్రావిశ్‌ హెడ్‌ను అక్షర్‌ పటేల్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ వికెట్‌లో టెస్టుల్లో అక్షర్‌ పటేల్‌ 50 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 47 వికెట్లతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని మొదలెట్టిన అక్షర్‌ పటేల్‌.. నాలుగు టెస్టుల్లో కలిపి 3 వికెట్లే పడగొట్టాడు. నాగ్‌పూర్‌ టెస్టులోనే 50 వికెట్ల క్లబ్‌ చేరతాడనే అంచనాలు ఉన్నప్పటికీ.. నాల్గో టెస్టు వరకు అక్షర్‌ పటేల్‌కు ఆ మైలురాయి వికెట్‌ దూరంగానే ఉండిపోయింది!. ఇక 158/2తో లంచ్‌ విరామానికి వెళ్లిన ఆస్ట్రేలియా.. డ్రింక్స్‌ విరామం లోపు మరిన్ని పరుగులు జోడించింది. ఈ సమయంలో చతేశ్వర్‌ పుజార, శుభ్‌మన్‌ గిల్‌ సైతం బంతితో వికెట్‌ వేట సాగించారు. డ్రింక్స్‌ విరామం అనంతరం మూడు ఓవర్లలోనే ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ డ్రాకు అంగీకరించటంతో అహ్మదాబాద్‌ టెస్టు అలా..అలా చప్పగా ముగిసింది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 480/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 571/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : మాథ్యూ కునేమాన్‌ (ఎల్బీ) అశ్విన్‌ 6, ట్రావిశ్‌ హెడ్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 90, మార్నస్‌ లబుషేన్‌ నాటౌట్‌ 63, స్టీవ్‌ స్మిత్‌ నాటౌట్‌ 10, ఎక్స్‌ట్రాలు :06, మొత్తం :(78.1 ఓవర్లలో 2 వికెట్లకు) 175.
వికెట్ల పతనం : 1-14, 2-153.
బౌలింగ్‌ : రవిచంద్రన్‌ అశ్విన్‌ 24-9-58-1, రవీంద్ర జడేజా 20-7-34-0, మహ్మద్‌ షమి 8-1-19-0, అక్షర్‌ పటేల్‌ 19-8-36-1, ఉమేశ్‌ యాదవ్‌ 5-0-21-0, శుభ్‌మన్‌ గిల్‌ 1.1-0-1-0, చతేశ్వర్‌ పుజార 1-0-1-0.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో..
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని 2-1తో గెల్చుకున్న టీమ్‌ ఇండియా టెస్టు సిరీస్‌ విజయంతో పాటు ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు దక్కించుకుంది. తొలి మూడు టెస్టుల్లోనే 2-1తో సిరీస్‌లో ముందంజ వేసిన టీమ్‌ ఇండియా.. చివరి టెస్టు డ్రా కావడానికి తోడు శ్రీలంక, న్యూజిలాండ్‌ తొలి టెస్టులో కివీస్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందటంతో అధికారికంగా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగు పెట్టింది. ఇండోర్‌ టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా సైతం ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జూన్‌ 7-11న లండన్‌లోని ది ఓవల్‌ మైదానంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ గద కోసం భారత్‌, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ వేటను ఇంగ్లాండ్‌ గడ్డపైనే మొదలెట్టిన భారత్‌.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడనుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా చివరి టెస్టు వాయిదా పడింది. ఐపీఎల్‌ అనంతరం ఇంగ్లాండ్‌లో చివరి టెస్టులో భారత్‌ కోల్పోయింది. దీంతో సిరీస్‌ డ్రాగా ముగిసింది. కానీ స్వదేశంలో న్యూజిలాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయాలు సాధించిన భారత్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆశలు సజీవంగా నిలుపుకుంది. 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ నిర్దేశించిన 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్‌.. ఐసీసీ డబ్ల్యూటీసీ గదను అందుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

Spread the love