వందే భారత్‌లో సాంకేతిక లోపం…

నవతెలంగాణ – కోల్‌కతా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట తర్వాత మరో రైలు ఏర్పాటు చేశారు. అయితే తగిన సౌకర్యాలు లేకపోవడం, ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం హౌరా-జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చివరి నిమిషంలో సాంకేతిక లోపం ఏర్పడింది. కాగా, హౌరా స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫారమ్‌ 4పై ఉన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సిన వారు చాలాసేపు అక్కడే ఉండిపోయారు. చివరకు గంట తర్వాత 7వ నంబర్‌ ఫ్లాట్‌ఫారమ్‌పై ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు అనౌన్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఉరుకులు పరుగులతో ఆ ఫ్లాట్‌ఫారమ్‌ వద్దకు చేరుకున్నారు. అయితే ప్రత్యేక రైలులో తగిన సౌకర్యాలు లేకపోవడం, తాగునీరు అందించకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రత్యేక రైలు ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Spread the love