– అహ్మదాబాద్‌లో భారీ వర్షం
– నేడు ఐపీఎల్ 16 ఫైనల్
– వర్షంతో పడని టాస్
ఐపీఎల్ తుది పోరు మెరుపులు చూసేందుకు వరుణుడు వచ్చాడు!. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రికార్డు టైటిల్‌పై కన్నేసి మొతెరా స్టేడియానికి రాగా.. మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందే వరుణుడు మైదానంలోకి అడుగుపెట్టాడు. ఎడతెరపి లేని వర్షంతో ఐపీఎల్ 16 టైటిల్ పోరు సాధ్యపడలేదు. టైటిల్ పోరు నేడు రిజర్వ్ డే (సోమవారం) జరుగనుంది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఆదివారం, ఐపీఎల్ మెగా సమరం. చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు ఐదో టైటిల్ వేట. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ట్రోఫీ ఆరాటం. అభిమాన ఎం.ఎస్ ధోని మాయజాలం చూసేందుకు అటు అహ్మదాబాద్‌లోని మొతెరా మైదానంలో అభిమానులు, ఇటు టెలివిజన్ ముందు క్రికెట్ ప్రియులు, మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ వీక్షకులు సిద్ధంగా ఉండగా.. వరుణుడు రంగ ప్రవేశం చేశాడు. అందరి ఆశలపై నీళ్లు చల్లాడు. ఎడతెరపి లేని వర్షంతో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ ఆరంభం కాలేదు. అంపైర్లు మ్యాచ్‌ను ఆదివారం రద్దు చేశారు. దీంతో రిజర్వ్ డే రోజున నేడు ఐపీఎల్ తుది పోరు జరుగనుంది.
చెరువులా మొతెరా : సాయంత్రం ఆరు గంటల సమయంలో మొదలైన వర్షం.. గంటల పాటు కురుస్తూనే ఉంది. మధ్యలో కొంతసేపు విరామం ఇచ్చినా.. మళ్లీ పుంజుకునేందుకే అన్నట్టు అనిపించింది. వర్షం విరామం ఇచ్చిన ప్రతిసారి మరింత భారీగా కురిసింది. పిచ్‌ను పూర్తిగా కవర్లలో కప్పి ఉంచినా.. మొతెరా అవుట్‌ఫీల్డ్ చెరువును తలపించింది. రాత్రి 11 గంటల తర్వాత సైతం వర్షం కురుస్తూనే ఉండటంతో.. మ్యాచ్ మొదలయ్యే అవకాశాలు లేవని అంపైర్లు ఆటను వాయిదా చేశారు.
మెగా పోరు నేడు : ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిబంధనల ప్రకారం ఫైనల్ పోరుకు రిజర్వ్ డే కేటాయించారు. అర్థరాత్రి 12.06 గంటలకు సైతం ఐదు ఓవర్లతో మ్యాచ్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే, అందుకు వరుణుడు సహకరించాలి. 11 గంటలు దాటినా వర్షం తీవ్రత తగ్గకపోవటం, కుదించిన ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు అవుట్ ఫీల్డ్ పూర్తిగా తడిసిపోవటంతో అంపైర్లు ఆదివారం ఆటను వాయిదా వేశారు. సోమవారం (రిజర్వ్ డే) ఐపీఎల్ ఫైనల్ పూర్తి స్థాయిలో జరుగనుంది. టాస్ పడకపోవటంతో నేడు 20 ఓవర్ల మ్యాచ్ ఉండనుంది. 7 గంటలకు టాస్, 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.