Thursday, September 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతాళ్లరాంపూర్‌‌లో మళ్లీ వీడీసీ రగడ

తాళ్లరాంపూర్‌‌లో మళ్లీ వీడీసీ రగడ

- Advertisement -

39 గౌడ, 11 దళిత కుటుంబాల బహిష్కరణ
కిరాణా, టిఫిన్‌ ‌సెంటర్‌‌లలో వారికి విక్రయాలపై ఆంక్షలు
దాడి చేసే అవకాశం ఉందని సీపీకి బాధిత కుటుంబాల ఫిర్యాదు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ‌ప్రాంతీయ ప్రతినిధి

నిజామాబాద్‌ ‌జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌‌లో వీడీసీ తమను మరోసారి బహిష్కరించినట్టు గౌడ, దళిత కుటుంబాలు సీపీ సాయిచైతన్యను బుధవారం కలిసి ఫిర్యాదు చేశాయి. మంగళవారం నుంచి 39 గౌడ, 11 దళిత కుటుంబాలను బహిష్కరించారని, తమకు కిరాణా దుకాణాల్లో సరుకులు విక్రయించకుండా ఆంక్షలు విధించారని, దీంతో పాటు తమతో గ్రామస్తులెవరైనా మాట్లాడితే రూ.25 వేలు జరిమానా విధిస్తామని ప్రకటించారని వాపోయారు. తమపై దాడి చేసే అవకాశం ఉందని సీపీకి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లరాంపూర్‌ కల్లు విక్రయాలపై వీడీసీ నిర్ణయించిన ధర చెల్లించుకోలేమని చెప్పినందుకు గతేడాది ఏప్రిల్‌లో గౌడ కులస్తులతో పాటు, కల్లు గీసే పలువురు దళిత కుటుంబాలను వీడీసీ గతంలో బహిష్కరించిన విషయం తెలిసిందే. దాంతో పాటు శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు గౌడ సామాజిక తరగతికి చెందిన మహిళలను ఆలయంలోకి రానీయకుండా అడ్డుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయమూ విధితమే.
ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం)తో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు వీడీసీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశాయి. బాధితుల ఫిర్యాదుతో పలువురు వీడీసీ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. జిల్లా అధికార, పోలీస్‌ ‌యంత్రాంగం సైతం దృష్టిసారించాయి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో సమావేశం నిర్వహించి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వీడీసీలను తక్షణమే రద్దు చేసుకోవాలని ఆదేశించడంతో వీడీసీని రద్దు చేసుకున్నట్టు సభ్యులు ప్రకటించారు. గతంలో చేసిన ఫిర్యాదుపై తాజాగా చార్జీషీట్‌ ‌దాఖలు చేసేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దీంతో తమపై గౌడ కులస్తులు మరోసారి కేసు పెట్టారని భావించి తమపై మళ్లీ రెండోసారి బహిష్కరించారని గౌడ కులస్తులు సీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికీ పట్టా భూముల్లోని చెట్ల నుంచి కల్లు తీయనివ్వడం లేదని, తమ భూమిని కబ్జా చేసి విక్రయించారని.. దానిని తిరిగి తమకు అప్పగించాలని గౌడ కులస్తులు డిమాండ్‌ చేస్తున్నారు. భూ విషయం డైవర్ట్ చేసేందుకు కల్లు విక్రయాలపై ఆంక్షలు పెట్టి తమను వారి ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ఓ సామాజిక తరగతికి చెందిన కొందరు ప్రయత్నం చేస్తున్నారని, వారి తీరుతో ఊర్లో ఆందోళన నెలకొందని వాపోయారు. తమ బహిష్కరణకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి వారిపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని తాళ్ళరాంపుర్ కల్లుగీత కార్మిక సంఘం, బాధిత గౌడ కుటుంబాలు, ఎస్సీ కుటుంబాలు సీపీ ఎదుట వాపోయారు.
ఈ విషయమై గత వీడీసీలో ఉన్న సభ్యులను ఆరా తీసేందుకు నవతెలంగాణ ప్రయత్నించగా.. వారు స్పందించేందుకు నిరాకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -