పోలింగ్ లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలి..

– 90 శాతం ఓట్లు పోలయ్యేలా చూడాలి
– ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ 
– బాధ్యతగా ఓటు వేసి ప్రజాసామాన్ని పరిరక్షించాలి
– కలెక్టర్ హరిచందన దాసరి పిలుపు 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ఈనెల 13న పార్లమెంటు ఎన్నికలకు జరగనున్న పోలింగ్ లో  ఓటర్లు పెద్ద ఎత్తున  పాల్గొని 80 నుండి 90 శాతం ఓట్లు పోలయ్యే విధంగా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం  జిల్లా వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు    ఓటరు చైతన్య కార్యక్రమాలలో భాగంగా శనివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన క్యాండిల్ వాక్ ను ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఎన్జి కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు వచ్చిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం మంచి శాంతియుత వాతావరణం లో ఉన్న నియోజకవర్గమని, ఈ నియోజకవర్గంలో 61,000 మంది నూతన ఓటర్లు నమోదయ్యారని, అయితే గతంలో 61 నుండి 64శాతం  ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తున్నదని, అలాకాకుండా ఈనెల 13 న లోక సభకు జరుగనున్న పోలింగ్ లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని 80 నుండి 90 శాతం పోలింగ్ అయ్యే విధంగా చూడాలని పిలుపునిచ్చారు.
    జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాసామాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈనెల 13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లోక సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుందని,  అందరూ వచ్చి ఓటు వేసే విధంగా చైతన్యం చేయాలని అన్నారు. జిల్లాలో పార్లమెంటు ఎన్నికలకు కొత్తగా 601,000 మంది నూతన  ఓటర్లుగా  నమోదయ్యారని, మన భవిష్యత్తు కోసం, మన కోసం తప్పనిసరిగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యానికి ఒక వెలుగును తీసుకువచ్చే విధంగా చూడాలని అన్నారు.ఈ సందర్భంగా ప్రతి ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు వేస్తామని క్యాండిల్ వాక్ కు వచ్చిన వారందరి చేత ఎన్నికల వ్యయపరిశిలకులు, జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం క్యాండిల్స్ చేత పట్టుకొని క్యాండిల్ వాక్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో, స్వీప్ నోడల్ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి ఇతర జిల్లా అధికారులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు,మహిళలు, తదితరులు  పాల్గొన్నారు.
Spread the love