నీరు, నీరు!

Sampadakiyam‘నీటి పేరు వింటేనే జలజలలాడిపోతాం, నీటితనంతో ప్రాణులం, నిత్య జీవన తేజో విరాజితుల మౌతాం’ అంటారు కవి ఎన్‌.గోపిగారు. నీటితోనే కదా జీవకోటి సజీవంగా కొనసాగుతున్నది. నీరు ప్రాణాధారం. స్వచ్ఛమైన నీటి కోసం, ఈ భూ ప్రపంచం మీది జనం ఎన్ని కన్నీళ్లు విడుస్తున్నారో కదా! నీరే మన తొంబై శాతం ఆరోగ్యాన్ని శాసించేది. నీరు కలుషితమైతే వ్యాధుల వెతలెన్నో మూగుతాయి. ఇంత ముఖ్యమైన, ప్రధానమైన విషయంపట్ల, అవసరంపట్ల మనం చూపిస్తున్న శ్రద్ధ మాత్రం వరుసలో చివరిది. ఈ భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97శాతం సముద్రపు నీరే. మరో రెండు శాతం మంచు రూపంలోని నీరు. మిగిలిన ఒక్క శాతం కన్నా తక్కువగా ఉన్న మంచినీరు జీవ కోటికి పనికివొచ్చే నీరు. ఇట్లాంటి నీటిని ఎంత జాగ్రత్తగా వాడాలి. ఎంత స్వచ్ఛంగా చూసుకోవాలి! నీటిని నీటిలానే ఉంచుతున్నామా! ప్రకృతి సిద్ధమైన నీరును కాపాడుకొనే ఆలోచన మనకేమయినా ఉందా! లేదు గాక లేదు. కొంతకాలమయ్యాక చివరికి రేషను మాదిరిగా నీటిని కొలతలేసి పంచాల్సిన పరిస్థితి వస్తదేమో! ఇప్పటికే ప్రపంచంలో 31శాతం ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 2030 నాటికి మన భారతదేశంలో 40శాతం ప్రజలు తాగునీటి కొరతతో, నీరు అందుబాటులో లేక జీవిస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ నీటి వ్యాపారంలోకి బహుళజాతి సంస్థలు అడుగుపెట్టేసాయి. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ప్రజలందరికి రక్షిత మంచినీటిని అందించాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి.
అదొక అంతర్జాతీయ సమస్య. అదలా ఉంచితే, మన దేశంలో ప్రాణాధారమైన నీరు అందిస్తున్న నదులు, చెరువులు, సెలయేరులు ఎంతో కలుషితమైపోతున్నాయి. ప్రకృతిని మన అవసరాలకు వాడుకోవాల్సిందే, కానీ పరిశుభ్రంగా ఉంచడం బాధ్యత. తీసుకున్నంత ఇవ్వాలి. ఇచ్చినంత తీసుకోవాలి. అంతేకాని అరాచకంగా వాడితే అనర్థమే మిగులుతుంది. పారే నదుల నీటిలోనూ ప్లాస్టిక్‌ మొదలైన కాలుష్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో నదులను పవిత్రంగా భావిస్తాము. నదిలో మునిగి పుణ్యస్నాన మాచరిస్తే పవిత్రులమైపోతామనే విశ్వాసాలు మెండు. కానీ మల మూత్రాలతో, మట్టితో, బూడిదతో, శవాలతో, బాటిళ్లతో, పాన్‌పరాకులతో, ప్యాకెట్లతో, మురికితో నింపిపోతాము. గంగా నది అంటే గొప్ప గౌరవం మనకు. కాలుష్య గంగగా మారిందెందుకు? ప్రక్షాళన జరిగేదెప్పుడు! ఏ నదీపూజలు చేయని చైనాలో నదులెంత శుభ్రంగా ఉన్నాయో చూడండి!
కుంభమేళాల పేరుతో నది నీటిని విపరీతంగా కలుషితం చేస్తున్న తీరును మనం గమనిస్తూనే ఉన్నాము. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం కోట్లాది మంది ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ కుంభమేళా సందర్భంగా స్నానాలు చేస్తే పొందే పుణ్యం గురించి, ప్రయోజనాల గురించీ ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసింది. తొక్కిసలాటలో ముప్పయి మందికిపైగా ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పటికే యాభై కోట్ల మంది జనం నదిలో మునిగిపోయారు. దీంతో నది నీటిలో స్థాయికి మించిన ఫీకల్‌ కొలీఫామ్‌ బ్యాక్టీరియా పెరిగిందని, స్నానానికి ఈ నీరు పనికిరాదని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నివేదికనిచ్చింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఎన్జీటీ కూడా కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. కానీ మన పేరుగాంచిన సనాతన ధర్మకుడు యోగీగారు, స్నానానికే కాదు, తాగడానికి కూడా అనుకూలమేనని దబాయిస్తున్నారు. ”మిష్టర్‌ యోగి.. మీ మంత్రివర్గం మొత్తం కుంభమేళాలో స్నానం చేసిన నీటిని ఓ గ్లాస్‌ తాగి చూపించండ”ని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సవాలు విసిరారు. కుంభమేళా ప్రారంభానికి ముందు త్రివేణి సంగమ నీటిని పరీక్షించి ఇచ్చిన నివేదికను చూపి, నీటిని తాగవచ్చని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడు తున్నారు. యోగుల స్వచ్ఛ కాలుష్య ప్రచారాలు ఇలా ఉన్నాయి. దేశ ప్రజలకు మంచినీటిని అన్ని గ్రామాలకు అందించలేని నాయకులు, ప్రజల విశ్వాసాలను రాజకీయాలకు ఉపయోగించుకోవటానికి ఏ మాత్రం సంకోచించటంలేదు. అసత్య ప్రచారానికీ పూనుకొంటున్నారు.
ఇప్పటికి కుంభమేళా నిర్వహణకు ఏడు వేల కోట్ల రూపాయిల్ని కేటాయించి ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం. దీని చుట్టూతా పెద్ద ఆర్థిక వ్యాపారమూ సాగుతున్నది. ప్రయాగ్‌రాజ్‌లో మూడు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోందని తెలిసింది. వ్యాపారులకు లాభాలు, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము నదుల పాలు, నదులు కాలుష్యం పాలు, ఇదీ మేళా జనసందోహపు సమీకరణం! ఇంకోవైపు చూడండి. ఎండాకాలం కుండలూ, బిందెలూ పట్టుకుని మైళ్లకు మైళ్లు మంచినీటి కోసం జనం బారులు తీరుతుంటారు. ఇదీ మన దేశ పురోభివృద్ధి దశ. ఇప్పటికైనా మేల్కోవాలి!

Spread the love