Thursday, September 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు, కాలనీలో నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ

వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు, కాలనీలో నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ

- Advertisement -

225 నీటి నమూనాలు వినియోగానికి సురక్షితమని నిర్ధారణ
మరింత పటిష్ట పరుస్తున్న దక్షిణ మధ్య రైల్వే : 
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ మెడికల్ డైరెక్టర్ 
డాక్టర్ నిర్మల రాజారాం సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

దక్షిణ మధ్య రైల్వే తన రైల్వే నెట్‌వర్క్ వ్యాప్తంగా సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, త్రాగునీటి వ్యవస్థ మొత్తాన్ని తరచుగా తనిఖీ చేయడం, నిర్వహించడంతో పాటు, నీటి వనరు, సరఫరా కేంద్రం వద్ద కూడా నీటి నాణ్యతను పరీక్షించడంపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా కాజీపేట , వరంగల్ రైల్వే స్టేషన్లు, వాటికి అనుసంధానంగా ఉన్న రైల్వే కాలనీల్లో నీటి నాణ్యత పర్యవేక్షణ, పరీక్షల ఏర్పాట్లను కూడా ఈ జోన్ మరింత ముమ్మరం చేసింది.
జోన్ నిరంతర ప్రయత్నాలలో భాగంగా, భూగర్భ జలం, పురపాలక నీటి సరఫరా, నిల్వ ఉన్న నీరు , క్లోరినేషన్, పంపిణీ వ్యవస్థలతో సహా మొత్తం నీటి సరఫరా ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నిర్మల రాజారాం సమీక్ష సమీక్షించారు. సరఫరా అవుతున్న నీటిలో ఈ.కోలి బ్యాక్టీరియాని గుర్తించడానికి క్రమం తప్పకుండా బ్యాక్టీరియాలజీ పరీక్షలు నిర్వహించడంతో పాటు, మిగిలిపోయిన క్లోరిన్ స్థాయిలను ప్రతిరోజూ పర్యవేక్షించడం ద్వారా పర్యవేక్షణ వ్యవస్థలను పటిష్టం చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి 15వ తేదీ వరకు కాజీపేట రైల్వే స్టేషన్, రైల్వే కాలనీ, వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి నీటి నమూనాలను సేకరించారు. వాటి పరీక్షా ఫలితాల్లో నీటి నాణ్యత సంతృప్తికరంగా ఉందని తేలింది. కాజీపేట రైల్వే స్టేషన్, కాలనీలో మొత్తం 149 సాధారణ నీటి నమూనాలను సేకరించారు. వాటిలో మిగిలిపోయిన క్లోరిన్ స్థాయిలను, ఇ.కోలి బ్యాక్టీరియా ఉనికిని గుర్తించడానికి బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహించారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లో 76 నీటి నమూనాలను సేకరించారు. వాటిలో మిగిలిపోయిన క్లోరిన్ స్థాయిలను, బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు కూడా నిర్వహించారు. సేకరించిన మొత్తం 225 నీటి నమూనాలు సంతృప్తికరంగా ఉన్నట్టు తేలింది. ఏ నమూనా కూడా వినియోగానికి అనర్హమైనదిగా నివేదించబడలేదు. ఇ.కోలి పాజిటివ్ ఆనవాళ్లు గుర్తించబడలేదు. ఈ పరీక్షలతో పాటు ,ఇంజనీరింగ్ విభాగం ద్వారా సాధారణ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం భూగర్భ జలాశయాలు (గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్లు) , ఇతర నీటి నిల్వ ట్యాంకులు క్రమం తప్పకుండా శుభ్రపరచబడుతున్నాయని కూడా నిర్ధారించారు. అంతేకాకుండా, క్రమం తప్పకుండా ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో డాక్టర్ నిర్మలా రాజారామ్ కాజీపేట రైల్వే స్టేషన్‌లో తాగునీటి నాణ్యత పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే స్టేషన్ ప్రాంగణంలో సరఫరా అవుతున్న నీటిలో మిగిలి ఉన్న క్లోరిన్ స్థాయిలను పరిశీలించి, తాగునీటిలో తగినంత స్థాయిలో క్లోరినేషన్ జరుగుతున్నట్టు గమనించారు.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తాగునీరు పూర్తిగా కలుషితం కాకుండా పర్యవేక్షించి, నిర్ధారించుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్లలో సరఫరా చేసే నీటి నాణ్యత, ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని కూడా ఆయన సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్కరికీ శుభ్రమైన, సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు, నీటి సరఫరాను తరచుగా పరీక్షించడం ద్వారా జోన్ వ్యాప్తంగా ఇదే స్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని ఆయన అధికారులకు, సూపర్‌వైజర్‌లకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -