అభివృద్ధిలో మనమే ఆదర్శం

We are the ideal in development– ఇంజినీర్స్‌ డేలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రాభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అనీ, కేవలం 9 ఏండ్లలోనే ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్పారు. తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జన్మదినాన్ని పురస్కరించుకొని 56వ ఇంజనీర్స్‌ డే ని శుక్రవారంనాడిక్కడి టీఎస్‌జెన్‌కో శక్తి బిల్డింగ్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎమ్‌డీలు జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యుత్‌ ఒక్కటే కాకుండా అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, దేశానికి ఆదర్శంగా ఉన్నామన్నారు. ఈ ప్రగతి సీఎం కేసీఆర్‌ దూరదృష్ట వల్లే సాధ్యమైందని చెప్పారు. సీఎమ్‌డీలు మాట్లాడుతూ ఉద్యోగుల్లోని నిబద్ధత, క్రమశిక్షణమే రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపిందని అన్నారు. కార్యక్రమంలో టీఎస్‌పీఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం, పీ రత్నాకరరావు, ఉపాధ్యక్షులు వెంకట్‌ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love