కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ – సీఐటీయూ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియొద్దీన్‌, ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6000 మంది కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు రెగ్యులరైజేషన్‌ చేయాలనీ, పరీక్షా విధానం రద్దు చేయాలని ఆగస్టు 15 నుండి సెప్టెంబర్‌ 4 వరకు 21 రోజులపాటు సమ్మెచేశారని వారు గుర్తుచేశారు. సమ్మె కాలంలో రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో మూడుసార్లు చర్చలు జరిపి, సెప్టెంబర్‌ ఒకటిన జరిగిన ఒప్పందం ప్రకారం ముగ్గురు అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందని తెలిపారు. కమిటీ యూనియన్లతో చర్చించి ప్రభుత్వానికి రిపోర్ట్‌ పంపి నిర్ణయాలు చేయాల్సి ఉందన్నారు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం తరపున డైరెక్టర్‌ గారు ఇచ్చిన హామీ మేరకు ఎరియర్స్‌ సెప్టెంబర్‌ 15 నాటికి రావాల్సి ఉన్నప్పటికీ రాలేదని విమర్శించారు. అలాగే సమ్మె కాలపు వేతనాలు చెల్లిస్తామని చెప్పినా జీతాలు కట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏఎన్‌ఎంలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో అప్లై చేసుకోవడానికి కూడా సమయం సరిపోవడం లేదు. డిఎంహెచ్‌వోలు సర్వీస్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా అర్బన్‌ హెల్త్‌ సెంటర్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను ఇబ్బంది పెడుతున్నారు . ఒకవేళ ఇచ్చినా అందులో సమ్మె కాలాన్ని మెన్షన్‌ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల వరకు వయసు పరిమితి పూర్తిగా ఎత్తివేయాలని కోరాము. దాన్ని పరిశీలిస్తామన్నారు. కానీ అది ఏం పరిష్కారం కాలేదు. నోటిఫికేషన్‌ డేట్‌ను వెంటనే పొడిగించాలని కోరుతున్నారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల ప్రధాన సమస్య అయిన రెగ్యులరైజేషన్‌, పరీక్ష విధాన రద్దు కోసం కమిటీ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి అలాగే సమ్మె కాలం జీతాలు, ఏరియర్స్‌ వెంటనే చెల్లించాలి. లేనిపక్షంలో మళ్ళీ ఆందోళన ప్రారంభిస్తామని వారు హెచ్చరించారు.

Spread the love