మావోయిస్టు అగ్రనేత సంజయ్ దీపక్‌ రావు హైదరాబాద్‌లో అరెస్టు

–  విలేకరుల సమావేశంలో వెల్లడించిన డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టు అగ్రనేత సంజయ్ దీపక్‌ రావుని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లిలోని మలేషియా టౌన్‌షిప్‌లోని తన సేహ్నితుల వద్ద ఉన్న సంజయ్ ను సైబరాబాద్‌తో పాటు యాంటీ నక్సటైట్‌ విభాగం ఎస్‌ఐబీ అధికారులు కాపు కాచి శుక్రవారం అరెస్టు చేసినట్టు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ విలేకురుల సమావేశంలో వెల్లడించారు. అరెస్టు చేసిన సంజయ్ నుంచి ఒక రివ్వాలర్‌, ఆరు బులెట్లు, కంప్యూటర్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన సంజయ్ 1980లో జమ్ము కాశ్మీర్‌లో ఐఐటీ ఇంజనీరింగ్‌ చేస్తూ.. విప్లవ కార్యకలాపాల పట్ల ఆకర్షితుడైనట్టు ఆయన తెలిపారు. తర్వాత సీపీఐ(ఎంఎల్‌)లో రవూఫ్‌ వర్గంలో చేరిన సంజయ్ తర్వాత సీపీఐ(ఎంఎల్‌) నక్సల్‌బరీ మురళీథరన్‌ వర్గంలో చేరి కార్యకలాపాలు సాగించాడని ఆయన తెలిపారు. అనంతరం 2007లో దండకారణ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీలతో సంప్రదింపులు జరిపిన మురళీథరన్‌, సంజయ్ లు తమ వర్గాన్ని మావోయిస్టు పార్టీల్లో విలీనం చేసినట్టు డీజీపీ తెలిపారు. ఇదే సమయంలో అనంతపురానికి చెందిన మావోయిస్టు పార్వతీని వివాహం చేసుకున్నాడు. అటుతర్వాత కేరళ, కర్నాటక, తమిళనాడు కలుపుతూ ఏర్పాటు చేసిన మావోయిస్టు వెస్ట్రన్‌ గార్డ్స్‌ ఏరియా కమిటీలో కీలక బాధ్యుడిగా సంజయ్ ను నియమించారు. తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఆయనకు స్థానం కల్పించిందని అంజనీ కుమార్‌ వివరించారు. అనంతరం ఆరోగ్య కారణాలరీత్యా మైదాన ప్రాంతానికి మారిన సంజయ్ హైదరాబాద్‌లో తన పూర్వ స్నేహితులతో ఉన్నట్టు నిఘా వర్గాలు కనిపెట్టి అరెస్టు చేశాయని ఆయన తెలిపారు. సంజరుపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షలు రివార్డుగా ప్రకటించిందని ఆయన వివరించారు.

Spread the love