అభివృద్ధికి సహకరించాం

రిపోర్టు టు ద పీపుల్‌ పేరుతో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
తొమ్మిదేండ్లలో కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరించామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపై హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణమండపంలో శనివారం పవర్‌ ప్లాంట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా శాతం పెరిగిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతగానో సహకరించారని తెలిపారు. తెలంగాణ అభివద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి తొమ్బిదేండ్లలో రూ.5లక్షల 27వేల కోట్లు వచ్చినట్టు చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఇద్దరూ ఒకే వేదికపై ఇలాంటి చర్చ చేస్తే అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా ఎజెండాగా మారే అవకాశం ఉంటుందని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది.. ఇంకా ఏం చేయడానికి అవకాశం ఉంది.. అనే అంశాల మీద ప్రజలకు అవగాహన వస్తుందన్నారు.రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా అన్నీ ప్రజాధనంలో నుంచే కేటాయిస్తాయని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి పౌర సమాజం, మేధావులు, ఆలోచనాపరులు, పాత్రికేయులు సోషల్‌ స్కూట్నీ ఉండే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించారని చెప్పారు. ఇలాంటి బహిరంగ చర్చల ద్వారా ప్రభుత్వం గురించి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడం సాధ్యమవుతుందన్నా రు.ఇలాంటి బహిరంగ చర్చా వేదికలు మంచి సంప్రదాయమని సీనియర్‌ జర్నలిస్టు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇలాంటి చర్చా వేదికల ద్వారా వాస్తవానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎక్కడున్నాయి.. అనే అంశాల పట్ల శోధించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, నాయకులు డీకే అరుణ, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love