అడెన్ : ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్ నౌకల రాకపోకలను నిషేధిస్తామని యెమన్‌లోని హౌతీలు ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో పోరు కారణంగా హార్ముజ్ జలసంధిలో నౌకల ప్రయాణానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హౌతీల తాజా ప్రకటనతో ప్రపంచ నౌకాయానానికి మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయిల్‌పై దాడులు చేశామని, ఎర్ర సముద్రంలో ఆ దేశానికి చెందిన నౌకల రాకపోకలను పూర్తిగా నిషేధించామని, దీంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హౌతీలు ఓ ప్రకటనలో తెలిపారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసి మూడు నెలలు దాటింది. తాజాగా తిరిగి దాడులు మొదలైన నేపథ్యంలో ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీలు జరిపే ఏ దాడి అయినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ఆందోళనలకు గురి చేస్తుంది.
సూయజ్ కాలువకు దారితీసే ఎర్ర సముద్రం నౌకా రవాణాకు కీలక మార్గం. ఇరాన్ యుద్ధ సమయంలో గల్ఫ్‌తో నిమిత్తం లేకుండా రోజుకు లక్షలాది బ్యారల్స్ మధ్యప్రాచ్య చమురును పైప్‌లైన్ ద్వారా సరఫరా చేసి ప్రధాన ప్రత్యామ్నాయ మార్గంగా నిలిచింది. పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు హౌతీలు 2023-2025 మధ్యకాలంలో ఈ మార్గంలో నౌకల రవాణాకు ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ జరిపిన పోరుకు వారు ఇప్పటి వరకూ దూరంగానే ఉంటూ వచ్చారు.
ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్ నౌకల రాకపోకలను అడ్డుకోవడం మొదటి చర్య అని, పరిస్థితి మరింత తీవ్రమైతే ఇజ్రాయిల్ వైపు వెళ్లే నౌకలన్నింటినీ అడ్డుకోవడం సహా ఇతర చర్యలు కూడా చేపడతామని హౌతీలు తెలిపారు. హౌతీల తాజా ప్రకటన కేవలం ఇజ్రాయిల్ నౌకలను మాత్రమే ఉద్దేశించి చేసినదని, ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలన్నింటికీ ఇది వర్తించదని బ్రిటన్‌కు చెందిన సముద్ర ప్రమాద నిర్వహణ సంస్థ వాన్‌గార్డ్ తెలియజేసింది. ఏదేమైనా ఆ ప్రాంతంలో ప్రయాణించే నౌకలన్నీ అప్రమత్తంగానే ఉండాలని సూచించింది. హౌతీల ప్రకటన విస్తృత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష సంబంధాలు లేని దేశాల నౌకలను కూడా హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. ఏయే నౌకలకు ఇజ్రాయిల్‌తో సంబంధాలు ఉన్నాయో గుర్తించే విషయంలో హౌతీలకు మంచి రికార్డు లేదని, కాబట్టి ఆఫ్రికా చుట్టూ ప్రయాణించి, ఇంధన బిల్లులు చెల్లించి, తక్కువ యుద్ధ ప్రమాద బీమా ప్రయోజనాలు పొందడం మంచిదని నిపుణులు సూచించారు. ఏదేమైనా హార్ముజ్ జలసంధి మూతపడిన సమయంలో ఎర్ర సముద్రంలో కూడా నౌకల రాకపోకలకు అడ్డంకులు ఏర్పడితే దాని ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది. ఇప్పటికే గల్ఫ్‌లో ఉత్పత్తి అవుతున్న ఇంధనం ఆ ప్రాంతాన్ని దాటి బయటికి రాలేకపోతోంది. సౌదీ అరేబియాలో ఉత్పత్తి అవుతున్న ముడి చమురు చాలా వరకూ పైప్‌లైన్ ద్వారా యన్బులోని ఎర్ర సముద్రం ఎగుమతి టెర్మినల్‌కు సరఫరా అవుతోంది.
ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్ నౌకాయానాన్ని నిషేధిస్తాం : హౌతీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



