హైదరాబాద్ తరహాలో రోడ్ల అభివృద్ధి :మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మర్రిగూడ ఫ్లైఓవర్ ప్రారంభం
నవతెలంగాణ– నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ పట్టణాన్ని సూపర్ సిటీగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ జంక్షన్ వద్ద రూ.65 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ ఫ్లైఓవర్ల తరహాలో మర్రిగూడ ఫ్లైఓవర్‌ను పెయింటింగ్స్, కళాఖండాలు, ప్రముఖుల చిత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని చెప్పారు. దిశా నిర్దేశక బోర్డులు, ప్రాంతాల పేర్లతో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ప్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు పట్టణ వాసులు కాలుష్యం నుంచి ఉపశమనం పొందుతారని తెలిపారు. ఇప్పటికే రూ.750 కోట్లతో నల్లగొండ ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. చర్లపల్లి, మర్రిగూడెం తదితర గ్రామాల్లో మట్టి రోడ్లు లేకుండా పూర్తిగా సీసీ రోడ్లు, డ్రయినేజీల నిర్మాణానికి రూ.300 కోట్ల ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి పంపామని తెలిపారు.
రైల్వే ట్రాక్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా నిర్మించనున్నట్టు వెల్లడించారు. రోడ్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టపరిహారం చెల్లించామని చెప్పారు. నల్లగొండ పట్టణ తాగునీటి పథకానికి ఇప్పటికే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. అదనంగా రూ.290 కోట్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, నెల రోజుల్లో నిధులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రాహ్మణవెల్లెంల వద్ద మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి, బక్కతాయికుంట అభివృద్ధికి రూ.7 కోట్లతో పనులు, పట్టణ అవసరాలకు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హ్యాం రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని, నల్లగొండ–దేవరకొండ నాలుగు లైన్ల రహదారి పనులకు ఇప్పటికే శంకుస్థాపన పూర్తయిందని చెప్పారు. తెలంగాణలో ఆర్‌అండ్‌బీ శాఖను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లోనూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పేదలకు సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మున్సిపల్ మాజీ చైర్మెన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



