Sunday, July 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి

ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి

- Advertisement -

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు 
డా. జిలెల్ల చిన్నారెడ్డి
తక్కువ నీటితో సాగయ్యే పంటలతో 
ప్రయోజనం: కలెక్టర్ ఆదర్శ్ సురభి
జయన్న తిరుమలాపూర్ లో రైతు సభ


నవతెలంగాణ- వనపర్తి
ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి సూచించారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్‌‌పేట్‌ మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, పంట మార్పిడి పై నిర్వహించిన రైతు గ్రామసభలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా సంప్రదాయ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రైతులు కేవలం దిగుబడినే కాకుండా పెట్టుబడి, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి ద్వారా నష్టాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వర్షపు నీటిని ప్రతి గ్రామంలో సంరక్షించుకోవడం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందన్నారు.

రైతులు ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంటలు, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా విజయవంతంగా ఎదుర్కోవచ్చని ఆయన అన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు వరి కాకుండా కందులు, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల్ని ఎంచుకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చన్నారు. ఇప్పటికే రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మండల ప్రత్యేక అధికారి, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, స్థానిక గ్రామ సర్పంచ్ గోపాల్, నాయకులు యాదయ్య, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -