Sunday, July 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి

నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి

- Advertisement -


ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ నాగన్న స్ఫూర్తితో
కమ్యూనిస్టులు ఐక్యం కావాలి : సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి
ఎస్వీకేలో నాగన్న సంతాప సభ


నవతెలంగాణ – ముషీరాబాద్
​నాగన్న పాట ప్రజా ఉద్యమానికి దిక్సూచి అని ప్రముఖ సంపాదకులు, కవి సతీష్ చందర్ అన్నారు. అరుణోదయ నాగన్న సంతాప సభ శనివారం హైదరాబాద్‌ ‌బాగ్‌‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పి.వేణు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగన్న గొప్ప గాయకుడిగా తన స్వరం ద్వారా పీడిత ప్రజల కష్టాలను వినిపించారని గుర్తు చేశారు. బాల్యం నుంచే కష్టాలను అనుభవిస్తూ పెరిగారని, ప్రజా సమస్యలను తన పాటల్లో ప్రతిబింబించిన నాగన్న నేటి తరం కళాకారులకు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. గాయకుడికంటే ముందు కమ్యూనిస్టుగా మారి తన జీవితాన్ని ప్రజా సాంస్కృతిక ఉద్యమానికి అంకితం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ప్రస్తుత మనువాద, కాషాయ పాలన నేపథ్యంలో నాగన్నలాంటి ప్రజాగాయకుడి లోటు తీవ్రంగా కనిపిస్తోందని, ఆయన స్ఫూర్తితో ప్రజా సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. నాగన్న స్ఫూర్తితో కమ్యూనిస్టులు ఐక్యం కావాలని కోరారు.

కష్టజీవుల అభ్యున్నతని, సంక్షేమాన్ని కోరుతూ అరుణోదయ నాగన్న తన జీవితాంతం కృషిచేశారని తెలిపారు. సభలో నాగన్నపై రచించిన పాటల పుస్తకంతోపాటు ఆయన జీవిత విశేషాలను ప్రతిబింబించే 350 పేజీల గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం నాగన్న జీవితంపై అరుణోదయ హైదరాబాద్ నగర శాఖ రూపొందించిన డిజిటల్ కళారూపాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర అరుణోదయ బృందం సైదులు, వేణు, ఇడంపాక శ్రీశైలం నాగన్న జీవితాన్ని ప్రతిబింబించే ఒగ్గుకథను ప్రదర్శించగా, న్యూ డెమోక్రసీ ఛానల్ ప్రతినిధులు ఉదయ్‌, ప్రిన్స్‌ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఆల్ ఇండియా అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చలపతిరావు, సాదినేని వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ వినయ్ బాబు, లెల్లె సురేష్, పసునూరి రవీందర్, జిలకర శ్రీనివాస్, యోజన, యశ్‌పాల్, భూపతి వెంకటేశ్వర్లు, ఆవునూరి మధు, జి.ఝాన్సీ, నాగరాజు, పరకాల అజయ్, కె.గోవర్ధన్, విమలక్క, పల్లె నరసింహ, పరకాల లక్ష్మి, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రజాకవి జయరాజు, ప్రకృతి వైద్యులు, టి.వెంకన్న నాగన్నకు నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర అరుణోదయ నాయకులు, కళాకారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -