రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రం చేస్తాం

– కోడ్ రాకముందే ప్రతిపాదన తయారు చేశాం
– ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ- రామగిరి: రామగిరి ఖిల్లాను పెద్ద పర్యాటక కేంద్రంగా చేస్తామని, ఎన్నికల కోడ్ రాకముందే ప్రతిపాదనలు పంపామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రామగిరిఖిల్లా సమీపంలో ఉపాధిహామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణతో కలసి ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ … కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పనిదినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి దఫాలో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఏమైనా సమస్యల ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం కింద నిధులు తగ్గించాడు తప్ప కనీసం పని దినాలు కూడా పెంచలేదనీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వంద రోజులు ఉన్న ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులు చేస్తాం అని అన్నారు అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలకు పెంపు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో పాటు ఆశీర్వాదంతోని ఇక్కడ నిరుద్యోగ సమస్యను అడ్రస్ లేకుండా చేసి ఉద్యోగాలు వచ్చేటట్లు పని చేస్తానని మాట ఇస్తున్నానీ అన్నారు. అలాగే మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని ప్రజలని కోరారు.
ఈ పార్లమెంటు ఎన్నికలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మన కోసం 5 న్యాయ గ్యారంటీలు అనే పథకాలను ప్రవేశపెట్టారని వాటిని కూడా కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో, అధిక ధరలతో నిరుద్యోగంతో ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. అలాగే స్వర్గీయ శ్రీపాద రావు, కాక వెంకటస్వామి చాలా మంచి స్నేహితులనీ, వారిలాగే అభివృద్ధికి కంకణ బద్ధుడనై పని చేస్తానని మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో రత్నాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ, ఐ ఎన్ టి సి నాయకులు ఎంపీపీ, ఎంపీటీసీలు, లు మాజీ సర్పంచులు సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, బీసీ సెల్ , ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love