ఈ విషయంలో ‘పెద్ది`కి మినహాయింపు లేదు
రాష్ట్రంలో పర్సంటేజ్ ప్రకారమైతేనే ఇకపై సిని మాలు ప్రదర్శిస్తాం అని తెలంగాణ ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రామ్‌చరణ్ హీరో బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ‘పెద్ది’ మూవీకి కూడా పర్సంటేజ్ కావాల్సిందేనని పట్టుబట్టారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ, ‘ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో రెండు మూడు సార్లు చర్చలు జరిగాయి. ‘హరి హర వీరమల్లు’ విడుదల సమయంలో రెండు నెలల్లో మా సమస్యను పరిష్కరిస్తామన్నారు. కానీ, సంవత్సరం అయిపోయింది. మొదట మూడు వారాలు అని అన్నారు. ఇప్పుడు ఆరు వారాలు అంటున్నారు. నిర్మాతలు మమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడు తున్నారు. టైమ్ పాస్ చేయడం కోసం గ్రేడింగ్ అనే మాట మొదలు పెట్టారు. పర్సంటేజ్ అమలు అయితేనే మేం సినిమాలు ప్రదర్శిస్తాం` అని అన్నారు. ‘120 మంది థియేటర్ల యజమానులు దీన స్థితిలో ఉన్నారు. 10, 15 ఏళ్ల కింద థియేటర్స్‌కి మంచి ఆదాయం ఉండేది. ఇప్పుడు ఎగ్జిబిటర్స్‌కి రెవెన్యూ రావడం లేదు. కానీ, నిర్మాతలకు 14 రకాలుగా ఆదాయం వస్తోంది. దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో పర్సంటేజ్ విధానమే నడుస్తోంది. ఇక్కడ మాత్రం రెంటల్ ఉంది. సమస్యను రోజురోజుకీ ఆలస్యం చేస్తున్నారు.
మా థియేటర్లలో రెంట్ ట్రాక్ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర ఎక్కడా తప్పు జరగడం లేదు. థియేటర్ల సౌండ్ సిస్టమ్, ఏసీలను బట్టి కాదు, అక్కడ వచ్చే కలెక్షన్లను బట్టి గ్రేడింగ్ చేయాలి. అలాంటి గ్రేడింగ్‌కు మాత్రమే మేము సిద్ధం. మాకు పర్సంటేజ్ విధానం కావాల్సిందే. అది ఎంత ఇస్తారో చెప్పండి’ అని బాల గోవింద్ రాజ్ చెప్పారు. విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ,‘ఆంధ్రాలో మాత్రమే ‘పెద్ది’ టికెట్ రేట్ల పెంపు ఉండొచ్చు. తెలంగాణలో పెంపులేదు. రేట్లు పెంచొద్దని, ప్రేక్షకులను చంపొద్దని సీఎం రేవంత్‌రెడ్డి, ఎగ్జిబిటర్లు, ఛాంబర్‌కు లేఖ ఇచ్చాం. ఒకవేళ పెంచుతూ నిర్ణయం తీసుకుంటే, డిమాండ్, సప్లయ్ ఆధారంగా మా నిర్ణయం ఉంటుంది. మేము ‘పెద్ది’ లాంటి సినిమాలకు సెల్యూట్ చేస్తాం. దాని మీద మాకు పగ ఏమీ లేదు. ‘పెద్ది’ని ఈ గొడవ నుంచి మినహాయించాలని అనుకున్నాం. కానీ, ఆ సినిమా తర్వాత కూడా మళ్లీ ఎప్పుడు మమ్మల్ని పట్టించుకుంటారనేది అర్థం కాకనే ఈ మూవీని కూడా పర్సంటేజ్ శ్లాబ్‌లో చేర్చాలని నిర్ణయించు కున్నాం. అవసరమైతే చిరంజీవి దృష్టికి మా సమస్యను తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తాం’ అని తెలిపారు. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో నైజాంలో ‘పెద్ది’ విడుదల, టికెట్ రేట్ల పెంపుపై సందిగ్ధత కొనసాగుతోంది.



