బహుజనులపై కుట్రలను తిప్పికొడతాం..

– ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ-కల్చరల్‌
గ్లోబల్‌ ప్రచారం.. అనుచిత వ్యాఖ్యలతో బహుజనులను అణచివేసే కుట్రలు ఇంకా సాగవని, వాటిని తిప్పికొడతామని ఎక్సైజ్‌, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రతిపక్ష నాయకులు ద్వేషంతో వృత్తి కులాల పట్ల వివక్షత చూపుతున్నారని, ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా అందరూ ప్రచారం చేయాలని చెప్పారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ రవీంద్రభారతి ప్రధాన వేదికపై సర్వాయి పాపన్నగౌడ్‌ 373వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాటి దళిత బహుజన మహనీయులు సార్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కొమరంభీమ్‌ వంటి వారి చరిత్ర మరుగుపడిం దన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ చొరవతో వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాపన్న బహుజనులను సమీకరించి పాలకులను ఎదిరించి పోరాడిన యోధుడని చెప్పారు. వృత్తుల రీత్యా వేర్వేరుగా ఉన్నా బహుజనులంతా ఒక్కటేనన్నారు. కష్టపడి ఎదిగిన బహుజనులపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విషం కక్కుతున్నారని విమర్శించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌ మాట్లాడుతూ.. తెలంగాణ మలి ఉద్యమంతో బహుజనుల నాయకులు, వీరుల చరిత్ర వెలుగులోకి వచ్చిందన్నారు. విశ్వవిద్యాలయంలోని విద్యావంతులు బహుజన నాయకులపై పరిశోధనలు చేసి వారి చరిత్రను ప్రచారం చేయాలని కోరారు. అధ్యక్షత వహించిన తెలంగాణ గీత కార్మికుల సహకార సంఘం చైర్మెన్‌ పల్లె రవి కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మొగల్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించి కోటలు కట్టి పాలన చేశారని.. ఆయనకు వచ్చినంత పేరు నవాబ్‌ను, భూస్వాములని ఎదిరించి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకున్న పాపన్నగౌడ్‌కు రాకపోవటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. బీసీ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. పాపన్న గౌడ్‌ బహుజనుల ఐక్యత కోసం కృషి చేశారని, అదే ఐక్యతతో వృత్తి కులాలకు మేలు చేసే నాయకులను ఎన్నుకోవటం పాపన్నకు సరైన నివాళి అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, బిసి కమిషన్‌ సభ్యులు ఉపేంద్ర కిషోర్‌, వృత్తి కులాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love