నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణాన్ని ప్రత్యేక కార్యాచరణతో రానున్న 15 నుంచి 20 రోజుల్లో క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగు నీటి పారుదల వంటి అత్యవసర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం పరకాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘం సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2027 డిసెంబర్ నాటికి పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. స్లమ్ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ జీ ప్లస్–2 విధానంలో ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది హాజరు పర్యవేక్షణ కోసం రెండు కొత్త బయోమెట్రిక్ యంత్రాలను వెంటనే కొనుగోలు చేయాలని, ప్రస్తుతం ఉన్న యంత్రాన్ని మరమ్మతు చేయించాలని ఆదేశించారు. వర్షాకాలంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, డ్రైనేజీ సమస్యలు ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం రూ.4.68 లక్షల వ్యయానికి సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే, మూడు స్వచ్ఛ ఆటోల కొనుగోలు, మున్సిపల్ కార్యాలయంపై సోలార్ పవర్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి వార్డుకు నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని, మున్సిపల్ పన్నుల వసూళ్లను 90 శాతానికి పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను అధికంగా రాబట్టేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎస్సీ కాలనీల్లో ఇంటి నంబర్లు లేని గృహాలకు నంబర్లు కేటాయించే ప్రక్రియపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి టౌన్ ప్లానింగ్, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆటోలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులను ప్రతి వార్డులో నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మరణం లేదా అనారోగ్య కారణాలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఎస్సీ కాలనీల్లో ఇంటి నంబర్ల సమస్యను రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ విజయలక్ష్మి, ఏసీపీ సతీష్ బాబు, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.



