15 ఎంపీ స్థానాలు గెలుస్తాం…

– ఈ ఎన్నికల్లో మావోయిస్టులు తమ వంతు సహకారం అందించాలి
– సమావేశంలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భారతదేశంలోని అత్యధికంగా 15 పార్లమెంటు స్థానాలు గెలుచుకునే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం గంగోలు గ్రామంలో గల వివిఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ భద్రాచలం నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు చింతిర్యాల రవికుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సాగునీటి ప్రాజెక్టులతో పాటు జాతీయ రహదారుల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినట్టు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సీతమ్మ సాగర్‌ పనులతో పాటు పాలెం వాగు, మోడీ కుంట ప్రాజెక్టు పనులను పూర్తి చేసే బాధ్యత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. సున్నం బట్టి వద్ద ప్రజల పళ్లి లిఫ్ట్‌ ఏర్పాటు కోసం కృషి చేస్తానన్నారు. భద్రాచలం గోదావరి నదిపై రెండవ వంతెన నిర్మాణ పనులను శ్రీరామనవమి నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసి ప్రారంభించినట్టు తెలిపారు. భద్రాచలం పట్టణంలోని సుభాష్‌ నగర్‌ ప్రాంతం గోదావరి ముంపునకు గురికాకుండా నిధులు కేటాయించి కరకట్ట పనులను సైతం ప్రారంభించామన్నారు. రైతులకు లాభదాయకంగా ఉండే పామాయిల్‌ సాగును అత్యధికంగా పెంచి అవసరమైతే దుమ్ముగూడెంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ఎంపీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలుగా సీపీఐ, సీపీఐ (ఎం) పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. తాను గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో అనేకమార్లు మావోయిస్టులు ఈ ప్రాంతానికి రావద్దని హెచ్చరికలు చేశారని అడవుల్లో ఉంటున్న అన్నలు ఏ అభివృద్ధి కోరుకుంటున్నారో మేము కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంగా అదే అభివృద్ధి కోసం వాగులు వంకల వెంబడి తిరుగుతున్నామని, ఎంపీ ఎన్నికల్లో మావోయిస్టులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రైతు డిక్లరేషన్‌ ప్రకటించగా ప్రియాంక గాంధీ యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించారని అన్నారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అని అశాభావం వ్యక్తం చేశారు. మే 13 జరిగే ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న కోరిక బలరాం నాయక్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే రాహుల్‌ గాంధీ ప్రభుత్వంలో బలరాముడు బాహుబలిగా అవకాశం లభిస్తుందని అన్నారు.
సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్‌, బుడగం శ్రీనివాస్‌, చర్ల జడ్పీటీసీ ఇర్ప శాంత, మండల అధ్యక్షులు వీరమాచినేని వినీల్‌, పరుచూరి రవి, పూజారి సూర్యచంద్రరావు, దర్శి సాంబశివరావు, మట్ట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం బలోపేతం : తుమ్మల
మణుగూరు : సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం బలోపేతమవుతుందని వ్యవసాయ సహకార చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కిన్నెర కళ్యాణ మండపంలో మహబూబాబాద్‌ పార్లమెంటు స్థాయి జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. కేంద్రంలో సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలన్నా సాగునీటి పథకాలు అమలు చేయాలన్న కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారులకు రావాలన్నారు. అనంతరం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శాసనసభ్యులను కాపాడుకోవడంతోనే సరిపోతుందని అన్నారు. మహబూబాబాద్‌ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న బలరాం నాయక్‌ మాట్లాడుతూ గత కాంగ్రెస్‌ పార్టీ హయాంలో పినపాక నియోజకవర్గంకి రూ.రెండు కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పొదెం వీరయ్య, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ తుళ్లూరు బ్రహ్మయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య, తెలుగుదేశం పార్టీ వాసిరెడ్డి తిరుపతిరావు, సభ్యులు తాళ్లూరి చంద్రశేఖర్‌, చక్రవర్తి, చందా సంతోష్‌ కుమార్‌, నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు పిరినాకి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love