స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ షట్కర్
నవతెలంగాణ – భిక్కనూర్
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండలం రామేశ్వరం పల్లి గ్రామంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు సులభంగా అందడంతో పాటు పలు సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రోడ్లు, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాణి రాజు, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఎడ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, గ్రామ వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు, పాత్రికేయులు పాల్గొన్నారు.



