Wednesday, May 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి?

ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి?

- Advertisement -

ఒకానొక దేశపు సంపదను వృద్ధి చేయడం అన్న లక్ష్యమే ఆ దేశపు విధానాన్ని ప్రధానంగా నిర్ణయిస్తుందని ఆడమ్‌ స్మిత్‌ 1776లో తన ఉద్గ్రంథం ‘వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌’లో పరిగణించాడు. దేశంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఆదాయం పంపిణీ ఏ ప్రాతిపదికన జరగాలన్న అంశానికి ప్రాధాన్యత లేదని అతడు ఎక్కడా చెప్పలేదు. అలాగే, డేవిడ్‌ రికార్డో కూడా కార్మికుల జీవన పరిస్థితుల మెరుగుదలకు ఏ ప్రాధాన్యతా లేదని ఎక్కడా చెప్పలేదు. కాని స్మిత్‌, రికార్డో ఆదాయ పంపిణీ సమస్యను పట్టించుకోకుండా కేవలం దేశ సంపద సైజు (పెట్టుబడుల విలువ) పైనే తమ దృష్టినంతటినీ సారించారు. పెట్టుబడుల సైజును బట్టి ఆ దేశపు ఆదాయం సైజు ఉంటుంది. ఇక ఆ ఆదాయం ఎలా పంపకం జరగాలన్నది విధానపరమైన సమస్యగా వారిద్దరూ భావించలేదు.కనీస అవసరాల స్థాయిని మించి వేతనాలను చెల్లిస్తే అది జనాభా వృద్ధికి దారి తీస్తుందన్న మాల్థస్‌ సిద్ధాంతాన్ని సాంప్రదాయ పెట్టుబడిదారీ సిద్ధాంతం స్వీకరించింది.

ఆ సిద్ధాంతం ప్రకారం వేతనాలను కనీస స్థాయికి మించి గనుక పెంచితే అప్పుడు జనాభా పెరుగుతుంది. అందువలన మార్కెట్‌లోకి వచ్చే కార్మికుల సంఖ్య పెరుగుతుంది. అలా కార్మికుల సంఖ్య పెరుగుతుంది కనుక దానికి తగ్గట్టు వేతనాలు మళ్లీ కనీస అవసరాల స్థాయికి చేరుకుంటాయి. అందుచేత ఆదాయ పంపిణీలో మెరుగుదల రావడం అనేది కార్మిక వర్గపు ‘అలవాట’ మీద ఆధారపడి వుంటుందే తప్ప ప్రభుత్వ విధానం మీద కాదు. ప్రభుత్వం ప్రధానంగా పెట్టుబడుల వృద్ధిపైన దృష్టి సారిస్తుంది. తద్వారా ఆదాయం వృద్ధి జరుగుతుంది. -ఇదీ సాంప్రదాయ పెట్టుబడిదారీ సిద్ధాంతం.

దీన్నిబట్టి ఆదాయ పంపిణీ విషయంలో ప్రభుత్వం పెద్దగా చేయగలిగేది ఏమీ ఉండదని సాంప్రదాయ సిద్ధాంతం నమ్ముతుందని చెప్పాలి. అయితే, ఆదాయ పంపిణీ విధానాన్ని దిగజార్చే విధానాలను అమలు చేసైనా సరే పెట్టుబడుల వృద్ధికి ప్రభుత్వం పూనుకోవాలనేది ఆ సిద్ధాంతం ఎక్కడా చెప్పలేదు. ఇది ఇటీవల కాలంలో అమలు జరుగుతున్న నయా ఉదారవాద విధానపు సిద్ధాంతంగా చెలామణీ అవుతోంది. దీనికి సాంప్రదాయ పెట్టుబడిదారీ సిద్ధాంతంలో ఎటువంటి మూలాలూ లేవు. నయా ఉదారవాద వ్యవస్థలో పెట్టుబడి ప్రపంచీకరణ జరుగుతుంది. కాని కార్మికులు మాత్రం ఆ యా దేశాలకే కట్టుబడి వుంటారు. పెట్టుబడి ఎక్కువగా పోగుబడేందుకు అనువైన పరిస్థితి ఎక్కడ ఉంటే అక్కడికి పెట్టుబడి పోతుంది.

వేతనాల స్థాయి తక్కువగా ఉండడం అనేది అటువంటి అనుకూల పరిస్థితుల్లో ఒకటి. అందుచేత నయా ఉదారవాద విధానాలను అమలు చేసే ఏ దేశమైనా, తన దేశంలోకి పెట్టుబడులను ఎక్కువగా రాబట్టుకోడానికి, తద్వారా అధిక జీడీపీ వృద్ధి రేటు సాధించడానికి, అనివార్యంగా కార్మికుల వేతనాలను కుదించడానికి, దానితోబాటు కార్మికుల హక్కులను నియంత్రించడానికి సిద్ధపడుతుంది. అందుచేత సాంప్రదాయ పెట్టుబడిదారీ సిద్ధాంతం పేరు చెప్పుకునో, మెజారిటీ ప్రజల ప్రయోజనాల పేరు చెప్పుకునో తన ‘జీడీపీ వృద్ధి రేటు సాధన’ లక్ష్యాన్నే సర్వస్వంగా చెప్పుకుంటూ సమర్ధించుకోడం చెల్లదు. అది కేవలం గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించే నయా ఉదారవాదపు సిద్ధాంతం.

ఆర్థికాభివృద్ధి అంటేనే జీడీపీ వృద్ధి అన్న సిద్ధాంతాన్ని బ్రెటన్‌వుడ్‌ సంస్థలు (ప్రపంచ బ్యాంక్‌, ఐ.ఎం.ఎఫ్‌) పనిగట్టుకుని ముందుకు తెచ్చాయి. తాము అంతకు మునుపు ప్రవేశ పెట్టిన ఆర్థికాభివృద్ధి విధానాలను అవే తిరగదోడాయి. కొంతమంది అభ్యుదయ భావాలున్న ఆర్థికవేత్తలు సైతం ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇదంతా సాంప్రదాయ సిద్ధాంతం చెప్పినదే అని వారిలో కొందరు భ్రమించడం కూడా జరిగింది.‘ఆర్థికాభివృద్ధి అంటే జీడీపీ వృద్ధే’ అన్న వాదనను తిరస్కరించడం అన్నది మొట్టమొదట జరిగినప్పుడే ప్రస్తుత వ్యవస్థను విమర్శనా పూర్వకంగా పరిశీలించడం సాధ్య పడుతుంది. అంటే ఐ.ఎం.ఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ వంటి సంస్థలతోబాటు, మూడవ ప్రపంచ దేశాల్లోని పలు ప్రభుత్వాలు కూడా తమ దేశాల ఆర్థిక విజయాలను అంచనా వేసే ప్రాతిపదికను పూర్తిగా తిరస్కరించాలి.

నయా ఉదారవాద శకంలో భారతదేశంలో పాలించిన ప్రభుత్వాలు తమ ఆర్థిక విజయాలకు కొలమానంగా జిడిపి వృద్ధి రేటును మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు. తద్వారా అంతకు పూర్వం అమలు జరిగిన విధానాల కన్నా తాము మెరుగైన విధానాలను అమలు చేస్తున్నట్టు సమర్ధించు కున్నారు. ఆర్థిక అసమానతలు, పౌష్టికాహార లేమి వంటివి దారుణ పరిస్థితులకు చేరుకుంటున్నా వాటిని పట్టించుకోలేదు. దేశంలో అత్యంత సంపన్నులైన ఒక శాతం వద్ద స్వాతంత్య్రం వచ్చే నాటికి జాతీయాదాయంలో 12 శాతం వాటా చేరితే, 1982 నాటికి వారి వాటా ఆరు శాతానికి పడిపోయింది. నయా ఉదారవాద విధానాలు వచ్చాక, 2022-23 నాటికి అది ఏకంగా 23 శాతానికి పెరిగింది. గత వంద సంవత్సరాలలోనూ ఆదాయాల అసమానతలు ఇంత దారుణంగా ఎన్నడూ లేవు.

గతంలో ప్రణాళికా సంఘం గ్రామీణ ప్రజల కనీస పౌష్టికాహార లభ్యత రోజుకు 2200 కేలరీలు అని ప్రాతిపదికగా నిర్ణయించింది. ఆ మేరకు పౌష్టికాహారం పొందలేకపోతున్న గ్రామీణ జనాభా శాతం 1973 నుంచి (ఆ ఏడాది నుంచే దేశంలో పేదరిక అధ్యయనం మొదలైంది) 1993 మధ్య కాలంలో ఒకే స్థాయిలో కొనసాగింది. ఆ తర్వాత 1993 నుంచి 2011 మధ్య కాలంలో ఆ శాతం 58 నుంచి 68 కి పెరిగింది. ఇక 2017-18 నాటికైతే అది ఏకంగా 80 శాతాన్ని దాటిపోయింది. దాంతో ప్రభుత్వం ఆ గణాంకాలనే ప్రజలకు అందకుండా తొక్కిపట్టింది. అంతేకాక రాబోయే కాలంలో గణాంకాలను సేకరించే విధానాన్నే మార్చేసింది! ఇక పట్టణ పేదల సంగతి చూస్తే వారిలో కూడా ఈ శాతం 57 నుంచి 65కి ఇదే కాలంలో (1993-2011 మధ్య) పెరిగింది. అయితే నయా ఉదారవాద కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిపోతోందన్న ప్రచారం చేసేవాళ్ళకి ఈ వాస్తవాలేమీ పట్టవు.

ఇటీవల ఐ.ఎం.ఎఫ్‌ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం బంగ్లాదేశ్‌ తలసరి జిడిపి భారతదేశపు తలసరి జీడీపీని దాటి కొద్దిగా ముందుకు పోయింది. నయా ఉదారవాదుల ప్రకారం బంగ్లాదేశ్‌ భారతదేశం కన్నా అభివృద్ధిలో ముందున్నట్టు భావించాలి. కాని ప్రధానమంత్రి మొదలు హిందూత్వ ప్రచారకు లందరూ బంగ్లాదేశ్‌ నుండి వస్తున్న ‘చొరబాటుదారుల’ గురించి గొంతులు చించుకుం టున్నారెందుకు? అభివృద్ధి మెరుగుగా సాధిస్తున్న దేశం నుంచి అభివృద్ధి తక్కువగా ఉన్న దేశానికి ఎక్కడైనా ప్రజలు వలసలు వస్తారా? అంటే హిందూత్వ వాదుల ‘చొరబాటుదారుల’ గురించిన ప్రచారమైనా బూటకమై వుండాలి లేదా జీడీపీ వృద్ధే ఆర్థికాభివృద్ధికి ప్రాతిపదిక అన్న వాదనైనా బూటకమై వుండాలి.మరి ఆర్థికాభివృద్ధికి సరైన కొలమానం ఏది? ప్రజాతంత్ర రాజ్యాంగ వ్యవస్థను కలిగి వున్న ఏ దేశంలోనైనా రాజకీయాధికారం అంతిమంగా ప్రజల చేతుల్లో ఉంటుంది. అటువంటి దేశంలో ఆర్థిక వృద్ధి సాధనతోబాటు సమాంతరంగా ప్రజలను ఆర్థికంగా శక్తివంతులుగా చేయడం అన్నది కూడా కొలమానంగా ఉండాలి. దేశంలో అత్యధిక శాతంగా ఉన్న శ్రామిక ప్రజల సగటు వాస్తవ ఆదాయాలలో పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలి.

దేశ జనాభాను మొత్తంగా ఒక్కటిగానే పరిగణించి సగటు ఆదాయ పెరుగుదలను లెక్కించడం వలన ఉపయోగం లేదు. అత్యంత సంపన్నులైన ఒక్క శాతం జనాభాను, కడు పేదరికంలో ఉన్న జనాభాను కలిపి ఒక్కటిగానే లెక్కిస్తే ఏమిటి ప్రయోజనం? అయితే శ్రామిక ప్రజల వాస్తవ సగటు ఆదాయాలను లెక్కించడంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వాటిని అధిగమించడానికి మొదట మనం దేశంలో అత్యంత దిగువ స్థాయిలో ఆదాయాలు ఉన్న 80 లేదా 90 శాతం ప్రజల సగటు వాస్తవ ఆదాయాలలో పెరుగుదలను లెక్కించడం చేయాలి. 1982-2022 మధ్య 40 సంవత్సరాల కాలంలో వార్షిక జాతీయాదాయ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. ప్రపంచ అసమానతల సూచికను ప్రమాణంగా తీసుకుంటే అత్యంత సంపన్నులైన ఒక్క శాతం ప్రజల వార్షికాదాయం 5.5 శాతం చొప్పున పెరిగింది.

తక్కిన 99 శాతం ప్రజల వార్షికాదాయాలు కేవలం 1.5 శాతం చొప్పున మాత్రమే పెరిగాయి. కాని దేశ జనాభానంతటినీ ఒక్కటిగానే పరి గణిస్తూ లెక్కిస్తే సగటు ఆదాయ వృద్ధిరేటు ‌రెండు శాతం మాత్రమే ఉంది. వాస్తవ పరిస్థితిని ఇది ఎంత తప్పుగా చూపుతోందో ఈ లెక్క బట్టే తెలుస్తోంది కదా! మన రాజ్యాంగమేమో ప్రజలకే అన్ని రాజకీయాధికా రాలనూ కట్టబెట్టింది. కాని దానికి కట్టుబడి పాలిస్తామని ప్రమాణం చేసే పాలకులు మాత్రం ప్రజల ఆర్థికాధికారాలన్నీ నిర్వీర్యం చేసే విధానాలను అమలు చేస్తూ ఇదే ‘విజయ వంతమైన ఆర్థిక విధానం’గా చెప్పుకుంటున్నారు. ఈ వైరుధ్యాన్ని అధిగమించాలంటే ఆర్థికాభివృద్ధికి ప్రమాణం గా శ్రామిక ప్రజల వాస్తవాదాయాల్లో సాధించే వృద్ధిని ప్రమాణంగా తీసుకుని అభివృద్ధిని నిర్ధారించే పద్ధతిని అమలు చేయాలి. రాజ్యాంగ సభ ముందు బి.ఆర్‌.అంబేద్కర్‌ చేసిన ముగింపు ప్రసంగంలో ఈ వైరుధ్యం గురించే ప్రస్తావించారు. దీన్ని గనుక అధిగమించడంలో విఫలమైతే రాజకీయ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని సరిగ్గానే హెచ్చరించారు. అందుచేత ఈ వైరుధ్యాన్ని అధిగమించడానికి మొదటి మెట్టుగా ప్రజలలో ‘అసలైన ఆర్థికాభివృద్ధి’ అంటే ఏమిటన్న అంశం మీద చర్చను ప్రవేశ పెట్టడం అవసరం.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -