లైంగికదాడి నిందితులకు శిక్ష ఏది !

What is the punishment for sexual assault accused?– నిర్దోషులుగా బయటకు వస్తున్న తీరు
– 31 సామూహిక లైంగికదాడి కేసుల్లో ఐదుగురే దోషులు
– గుజరాత్‌ ప్రభుత్వం సరిగ్గా సహకరించటం లేదు
– అందుకే నిందితులకు శిక్ష పడటం లేదు
– సామాజికవేత్తలు,మహిళా సంఘాల నాయకుల ఆందోళన
అహ్మదాబాద్‌: ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో సామూహిక లైంగికదాడుల కేసుల్లో నిందితులు తప్పించుకుంటున్నారు. గత నాలుగేండ్లలో ఇలాంటి ఘటనలు మొత్తం 31 చోటు చేసుకున్నాయి. ఇందులో కేవలం ఐదుగురు మాత్రమే దోషులుగా తేలటం గమనార్హం. అయితే, రాష్ట్ర ప్రభుత్వం లైంగికదాడుల కేసులను సీరియస్‌గా తీసుకోవటం లేదనీ, అందుకే నిందితులు సులువుగా తప్పించుకోగలుగుతున్నారని సామాజికవేత్తలు, మహిళా సంఘాల నాయకులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లో నమోదైన మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య కలవరపాటుకు గురి చేస్తున్నదని చెప్పారు. 2021 వరకు గత ఐదేండ్లలో రాష్ట్రంలో 2,633 లైంగికదాడి కేసులు, 31 సామూహిక లైంగికదాడి, హత్య కేసులు నమోదయ్యాయి. లోక్‌సభలో భారత ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం.. సామూహిక లైంగికదాడి, హత్య కేసుల్లో కేవలం ఐదుగురిని మాత్రమే విచారించగా, ఐదేండ్లలో 4,820 కేసులు ‘ఆమె నిరాడంబరతను ద్వేషించే ఉద్దేశ్యంతో మహిళలపై దాడి’ కింద నమోదయ్యాయి.
గుజరాత్‌కు సంబంధించిన గణాంకాల ప్రకారం.. 2017లో నలుగురు మహిళలు సామూహిక లైంగికదాడి, హత్యకు గురయ్యారు. కానీ ఎవరికీ శిక్ష పడలేదు. 2018లో ఆరు కేసులు నమోదు కాగా ఎవరికీ శిక్ష పడలేదు. మరుసటి ఏడాది ఏడు కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఎవరికీ శిక్ష పడలేదు. 2020లో ఎవరికీ శిక్ష పడకుండానే ఏడు కేసులు నమోదయ్యాయి. 2021లో ఏడు కేసులు నమోదయ్యాయి, ఐదుగురిపై విచారణ జరిగింది.ఆలిండియా మహిళా సాంస్కృతిక సంస్థ మీనాక్షి జోషి మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో లొసుగులు ఉన్నందున సామూహిక లైంగికదాడి వంటి క్రూరమైన నేరాలలో శిక్షలు పడకపోవడానికి ప్రభుత్వ యంత్రాంగమే కారణమని అన్నారు. సంబంధిత చట్టంలోని సెక్షన్‌ 164 ప్రకారం, ప్రాణాలతో బయటపడిన వారి స్టేట్‌మెంట్‌ను వీలైనంత త్వరగా తీసుకోవాలి, అయినప్పటికీ రాష్ట్ర యంత్రాంగం ఆసక్తి చూపలేదనీ, ఈ విషయంలో నెమ్మదిగా ఉన్నదని అన్నారు.లోక్‌సభలో సమర్పిం చిన గణాంకాల ప్రకారం.. 2017లో గుజరాత్‌లో 477 లైంగికదాడి కేసులు నమోదయ్యాయి. 37 మంది నిందితులను దోషులుగా నిర్ధారించగా, 283 మంది నిర్దోషులుగా విడుదలయ్యారు. 2018లో 553 కేసులు నమోదయ్యాయి. 20 మందిని దోషులుగా నిర్ధారించి, 179 మందిని విడుదల చేశారు. 2019లో 528 కేసులు నమోదు కాగా, 31 మందిని దోషులుగా, 165 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. 2020లో 486 కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించారు. 77 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. 2021లో 589 కేసులు నమోదయ్యాయి, 14 మందిని దోషులుగా నిర్ధారించగా, 134 మంది నిర్దోషులుగా విడుదల కావటం గమనార్హం.

Spread the love