50 ఏళ్లు ఏం చేయనోళ్లు.. ఇప్పుడేం చేస్తారు…

– కాంగ్రెస్, బీజేపీ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు 
– మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం
– నా సుదీర్ఘ రాజకీయ జీవితం ప్రజ సేవకే అంకితం 
– శ్రీ తులసి మండల సమాఖ్య వార్షికోత్సవ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-పెద్దవంగర: యాభై ఏళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయనోళ్లు ఇప్పుడొచ్చి ఏం చేస్తారు? కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో దంతాలపల్లి రేణుక అధ్యక్షతన శ్రీ తులసి మండల సమాఖ్య 7వ వార్షికోత్సవ మహసభను నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై, ఎంపీపీ ఈదురు రాజేశ్వరితో కలిసి ప్రసంగించారు. 67 ఏళ్ల పాలనలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని, అలాంటి వారు వచ్చి నేడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పదిసార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ నేతలు ఏం చేశారని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని ప్రజా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకూడదని, వారిని పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో నాపై పోటీకి వ‌చ్చిన వాళ్ళు త‌ర్వాత ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ క‌నిపించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. టూరిస్టుల్లా వ‌స్తారు, పోతారు. వాళ్ళ‌ను ప‌ట్టించుకోవాల్సిన అస‌వ‌రం లేదు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ వ‌చ్చాకే బాగుప‌డింది. బంగారు తెలంగాణ అవుతున్న‌ది. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం కూడా నేను వ‌చ్చాకే బాగుప‌డింది. ఎంతో ప్ర‌గ‌తి జ‌రిగింది. ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉంది. అదంతా పూర్తి కావాల్సి ఉంది. మీరంతా ఆశీర్వ‌దిస్తే, పూర్తి చేసే బాధ్య‌త నాది. ఇప్ప‌టి ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ద్వారా నా కుటుంబం అంతా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల కోస‌మే క‌ష్ట ప‌డుతున్నాం. సొంత నిధులు ఖ‌ర్చు చేస్తున్నాం. ప్ర‌జ‌ల కోసం ఎంత చేయ‌డానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను. మీ ఆద‌రాభిమానాలు కావాలి. మీరు కేసీఆర్‌కు నాకు అండ‌దండ‌గా నిల‌వాల‌ని మ‌హిళ‌ల‌కు మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం శ్రీ తులసి మండల మహిళా సమాఖ్యలోని 114 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 7 కోట్లు, స‌మాఖ్య సంఘంలోని 50 స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రూ. 2 కోట్ల చెక్కులను మంత్రి ఆయా సంఘాల‌కు పంపిణీ చేశారు.
సెప్టెంబ‌ర్ 8న తొర్రూరులో మెగా జాబ్ మేళా:
వ‌చ్చే నెల 8వ తేదీన తొర్రూరులో మెగా జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నాను. ఈ సంద‌ర్భంగా అర్హ‌త‌లు ఉన్న వాళ్ళంద‌రికీ ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ద‌క్కుతాయి. చ‌దువుకున్న వాళ్ళంతా ఇందుకుసిద్ధం కావాలి. మీకు సంబంధిత‌ వివ‌రాల‌ను కూడా త్వ‌ర‌లోనే అందిస్తామ‌న్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా యువత యువకులు మెగా జాబ్ మేళాకు హాజరై ఉపాధి పొందాలని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
కుటుంబ సమ్మతంగా వ‌ల్మిడికి రావాలి:
వ‌చ్చే 4న వ‌ల్మిడి శ్రీ సీతారామ‌చంద్ర స్వామివారి విగ్ర‌హాల పునః ప్ర‌తిష్టాప‌న, దేవాల‌య పునః ప్రారంభోత్స‌వాల‌కు స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా త‌ర‌లి రావాల‌ని మంత్రి మ‌హిళ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. వల్మిడి ఆలయాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట మాదిరిగా అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచులు వెనుకదాసుల లక్ష్మీ రామచంద్రయ్య శర్మ, గాజుల శోభ ప్రసాద్ రావు, సలిదండి మంజుల సుధాకర్, జాటోత్ చిలకమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు అనురాధ, ఎర్ర సబిత వెంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్ ముత్తినేని శ్రీనివాస్, ఏపీడీ డాక్టర్ వెంకట్, ప్రాజెక్ట్ మేనేజర్ రవీందర్ రావు, మల్లికార్జున చారి, జ్ఞానేశ్వర చారి, డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం నరేందర్ కుమార్, తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఆర్ఐ భూక్యా లష్కర్, సీసీలు సుధాకర్, సుజాత, నిమ్మల శ్రీనివాస్, అనపురం రవి గౌడ్, ఎండీ ముజీబ్, అనిల్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love