Tuesday, May 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఫీజులకు కళ్లెం ఇంకెప్పుడు?

ఫీజులకు కళ్లెం ఇంకెప్పుడు?

- Advertisement -

భారతదేశంలో విద్య క్రమంగా వ్యాపార వస్తువుగా మారిపోతోందా? అంటే అవుననే అంటున్నారు విద్యావేత్తలు. ఎందుకంటే, కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే కాదు.. పలు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ప్రయివేటు కార్పొరేట్ పాఠశాలల ఫీజులు తల్లిదండ్రులకు షాక్‌కు గురిచేస్తున్నాయి. అగ్రశ్రేణి స్కూళ్లమని చెప్పుకునే కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయి. అమెరికాలోని ఐవీ లీగ్ అండర్‌ గ్రాడ్యుయేట్ ట్యూషన్ ఫీజులు లేదా యూరప్‌లోని ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూళ్ల ఫీజులకు సమానంగా ఇక్కడ ఫీజులు ఉండటం ఆశ్చర్యం.

భారతదేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ వార్షిక ఆదాయంలో 50 శాతం నుంచి 130 శాతం వరకు పిల్లల స్కూల్ విద్య కోసం ఖర్చు చేస్తున్నారనే అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో వార్షిక ఆదాయానికంటే ఎక్కువ మొత్తాన్ని విద్య కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సింగపూర్, దుబాయ్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఉన్న స్కూల్ ఫీజులతో సమానంగా మన దేశంలో ఫీజులు వసూలు చేస్తున్నా.. అందుకు తగ్గట్టుగా భారతీయ తల్లిదండ్రుల ఆదాయాలు మాత్రం లేవు.

లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్న పిల్లలకు అందుకు తగిన విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదనే విమర్శలు కోకొల్లలు. అనేక స్కూళ్లలో మౌలిక వసతులు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఒక తరగతి గదిలో సగటున 35 నుంచి 40 మంది విద్యార్థులు కూర్చోవాల్సి వస్తోంది. స్విమ్మింగ్ పూల్స్, ల్యాబ్‌లు, ఆడిటోరియంలు ఉన్నప్పటికీ.. వాటిని పరిమితికి మించి విద్యార్థులు వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.అంతర్జాతీయ ప్రమాణాల విద్య అని ప్రచారం చేస్తున్నా.. ఉపాధ్యాయుల శిక్షణ, బోధనా విధానాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విదేశాల్లోని అనేక ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఒక తరగతి గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఫీజులకు తగినట్టుగా సదుపాయాలు, వ్యక్తిగత శ్రద్ధ, నాణ్యమైన విద్య అక్కడ విద్యార్థులకు అందుతుంది.

మన రాష్ట్రంలోనూ ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచకుండా నియంత్రిస్తామనే మాటలు సంవత్సరాలుగా వినిపి స్తున్నా.. అవి ఆచరణలోకి రావడం లేదు. మరో విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గరపడు తున్నప్పటికీ, ఫీజుల నియంత్రణపై స్పష్టమైన చర్యలు కనిపించక పోవడంతో తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళన పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఫీజుల నియంత్రణ కోసం కమిటీలు ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబు తున్నా.. చట్టపరమైన చర్యల విషయంలో మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదు. దేశంలోని అనేక నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే స్కూల్ ఫీజులు అధికంగా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఇంజనీరింగ్ విద్యకు సమానంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నియంత్రణ లేకపోవడంతో కొన్నిచోట్ల ప్రతి ఏడాది 20 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రయివేటు పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని హైకోర్టులో అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అమలులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. విద్యా హక్కు చట్టం–2009లోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం అన్‌ఎయిడెడ్ ప్రయివేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇరవై ఐదు శాతం సీట్లను బలహీన వర్గాలు, అనాథలు, ఎయిడ్స్ బాధిత కుటుంబాల పిల్లలకు కేటాయించాలి. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వం తిరిగి చెల్లించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ నిబంధనను అమలు చేస్తున్నప్పటికీ.. మన రాష్ట్రంలో మాత్రం సవరణల పేరుతో అమలు నిర్లక్ష్యానికి గురవుతోంది.

ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి బాధ్యతగా రాజ్యాంగంలో పొందుపరిచాయి. ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ విద్యారంగంపై నియంత్రణ కోల్పోయిన పాలకులు.. దాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో వ్యాపార వస్తువుగా మారనిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉచిత పథకాలపై చూపుతున్న శ్రద్ధ.. విద్య, వైద్యం వంటి ప్రాథమిక రంగాలపై కనిపించడం లేదు.ఉచిత, నాణ్యమైన విద్య కోసం ప్రజల్లో మరో చైతన్య పోరాటం రావాల్సిన అవసరం ఉంది.

మేకిరి దామోదర్ 9573666650

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -