క్షేత్రస్థాయి ఉద్యోగుల ఓటు ఎటువైపో?

క్షేత్రస్థాయి ఉద్యోగుల ఓటు ఎటువైపో?– అణచివేత ధోరణితో సర్కారుపై తీవ్ర అసంతృప్తి
– అదే బాటలోనే స్కీం వర్కర్లు.. ఆందోళనలో రాష్ట్ర సర్కారు
– ప్రజల్ని ప్రభావితం చేయడంలోనూ వారిది కీలక పాత్ర
– వారిని తమవైపు తిప్పుకునే పనిలో ప్రతిపక్ష పార్టీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామస్థాయి ఉద్యోగులు, స్కీం వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా? జీతాలు పెంచాలి..సమస్యలు పరిష్కరించాలి అడిగిన పాపానికి కేసీఆర్‌ సర్కారు వ్యవహరించిన తీరుపై కసితో రగిలిపోతున్నారా? ఒకప్పుడు అధికార పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేసిన వారే..ప్రస్తుత ఎన్నికల్లో తిరగబడబోతున్నారా? అంటే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి. మెజార్టీ క్షేత్రస్థాయి ఉద్యోగులు, కార్మికుల నుంచి అదే మాట వినిపిస్తున్నది. వేధింపులు..అణచివేతలు..తీసివేతలు..పోరాటాల తర్వాత ఎంతో కొంత మేర మేలు జరిగినప్పటికీ ప్రభుత్వం తమ పట్ల వ్యవహరించిన తీరుపై వారు గుర్రుగా ఉన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఫీల్డు అసిస్టెంట్లు సమ్మెలోకి వెళ్తే సర్కారు నిర్దాక్షిణ్యంగా తీసేసింది. వేడుకోవడాలు..విన్నపాలు..అంతిమంగా పోరాటాలతో ఎన్నికల ఏడాదిలో గొడవెందుకని సర్కారు దిగొచ్చి విధుల్లోకి తీసుకున్నది. 33 నెలల సుధీర్ఘ పోరాటం తర్వాత ఉద్యోగంలోకి తీసుకోవడంపై వారు పైకి సంతోషం ప్రకటిస్తున్నప్పటికీ లోలోన రగిలిపోతున్నారు.
సర్కారు తమ పట్ల దారుణంగా వ్యవహరించదనే భావనలో వారున్నారు. తమపై ‘అవినీతిపరులు’ అనే ముద్రవేసి వేర్వేరు శాఖల్లోకి బదిలీ చేయడంపై వీఆర్వోలు తీవ్ర ఆగహ్రంతో ఉన్నారు. వీఆర్‌ఏలను పర్మినెంట్‌ చేసినప్పటికీ..ఆ విషయంలో ఇంకా స్పష్టతనివ్వకపోవడంపై వారూ అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీ కార్యదర్శులు తీవ్ర పనిభారంతో తల్లడిల్లుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. గ్రామ పంచాయతీ కార్మికులు కూడా అదే స్థితిలో ఉన్నారు. సంఖ్యా పరంగా ఫీల్డు అసిస్టెంట్లు, వీఆర్‌ఏలు, వీఆర్వోలు, గ్రామపంచాయతీ కార్మికులు, గ్రామకార్యదర్శులు లక్ష లోపే ఉన్నారు. వారి కుటుంబ ఓట్లను లెక్కిస్తే ప్రతి మూడులక్షలకుపైనే ఉంటారు. అంటే నియోజకవర్గానికి సగటున 2500 మంది దాకా ఉన్నారు. ఈ ఉద్యోగులంతా క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా ప్రభావితం చేయడంలో కీలకంగా మారే అవకాశముంది. ప్రభుత్వంపై తమకున్న అసంతృప్తితో నియోజకవర్గంలో ఒక్కొక్కరు కనీసం 20, 30 ఓట్లను ప్రభావితం చేసినా 10 వేల నుంచి 20 వేల ఓట్ల మేర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో సహజంగానే కొంతమేర అసంతృప్తి ఉంది. ఈసారి హోరాహోరిగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అభ్యర్థి అయినా 5 వేల నుంచి 10 వేల ఓట్లతోనే గెలిచే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ఆ ఉద్యోగుల పాత్ర కీలకం కానున్నదనే చర్చ నడుస్తున్నది.
అదే బాటలో స్కీం వర్కర్లు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేది స్కీం వర్కర్లే. రాష్ట్రంలో మూడు లక్షల మందికిపైగా ఉన్నారు. అందులో అంగన్‌వాడీలు, ఆశాలు, మధ్యాహ్నభోజన కార్మికులు, ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో సగటున చూస్తే ఒక్కో నియోజకవర్గంలో 2500మంది స్కీం వర్కర్లు ఉన్నారు. వీరంతా ఆయా నియోజకవర్గాల ఓటర్లే. ప్రజలతో నిత్యం సంబంధాలున్న వారే. వీరి సమస్యలను పరిష్కరించే విషయంలో సర్కారు మొండి వైఖరి అవలంబించడం పట్ల స్కీం వర్కర్లు సైతం ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు. వీరి ఓట్లు ఎటు బదిలీ అవుతాయన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. అధికార పార్టీ గెలుపోటములపై ఈ ఓట్లు ప్రభావం చూపే అవకాశముంది.

Spread the love