నవతెలంగాణ – మానకొండూరు : కాంగ్రెస్ మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. ధరణిని తీసేసి భూమాత పెడుతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.. అది భూమాతానా..? భూమేతనా..? అని కేసీఆర్ విమర్శించారు. మానకొండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని రసమయి బాలకిషన్‌కు మద్దతుగా ప్రసంగించారు. అధికారంలోకి వస్తే మూడే గంటలు కరెంట్ ఇస్తమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కర్ణాటకలో 20 గంటల కరెంట్ ఇస్తమని నరికారు.. కానీ 3 గంటలే ఇస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన డీకే శివకుమార్.. కేసీఆర్ కర్ణాటకలో 5 గంటల కరెంటో ఇస్తున్నామని అంటే.. సన్నాసి కొడుకా 24 గంటలు ఇస్తున్నామని చెప్పిన.. దయచేసి అందరూ ఆలోచించాలి. ఇది రైతుల యొక్క జీవన్మరణ సమస్య. ఓట్లు అంటే మమూలు విషయం కాదు. అందుకే చెప్పిన ఓటు మన తల రాత మారుస్తది. ఐదేండ్ల భవిష్యత్‌ను నిర్ణయిస్తది. జాగ్రత్త అని కేసీఆర్ సూచించారు.
ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తరట కాంగ్రెసోళ్లు. వాళ్లు వస్తే వచ్చినాటికి సచ్చినాటికి కానీ. కాంగ్రెస్ మాటలను మీరంతా విమర్శించాలి. ధరణి తీసి బంగాళాఖాతంలో వేసి భూమాత పెడుతరట. అది భూమాతనా.. భూమేతనా..? మళ్లా వీఆర్‌వోలను తీసుకొస్తాం. 34 కాలమ్స్ పెడుతాం. కౌలుదార్ల కాలం పెడుతాం. అంటే రైతులకు కౌలుదార్లకు జుట్లు జట్లు ముడేస్తర..? ధరణి తీస్తే రైతుబంధు ఎలా వస్తుంది. మళ్లా వీఆర్వోలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు సంతకం, సర్టిఫికెట్ తీసుకురా అంటరు. మళ్లీ లంచాలు, దళారీల రాజ్యం, వీఆర్ఎవోల రాజ్యం వస్తది అని కేసీఆర్ మండిపడ్డారు. మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే. పెత్తనం ఆఫీసర్లది ఉండే. ఇప్పుడే హక్కులు మీకే ఇచ్చాం. మీ బొటనవేలితో మీ భూమి హక్కు మారుతుది. మీ భూమిని సీఎం కూడా మార్చలేడు. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని తీసి ఉంచుకుంటారా..? పొడగొట్టుకుంటారా..? దయచేసి నిర్ణయం చేయాలి. ఆలోచన చేయాలి. మళ్లా ధర్నాలు, నిరసనలు, బాలకిషన్ పాటలు.. మన బతుకే ఉద్యమమా..? గత పదేండ్ల నుంచి 70 ఏండ్లలో లేనంత శాంతంగా ఉంది తెలంగాణ. ఎవరికి తోచిన పని వారు చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగం కుదుటపడ్డది. రైతుల ముఖాలు తెల్లవడ్డాయి. గ్రామాల్లో ఇండ్లు కట్టుకున్నాం. పల్లెల్లో పల్లె దవాఖానాలు, బస్తీల్లో బస్తీ దవాఖానాలు, నియోజకవర్గంలో 100, 200 పడకల దవాఖానాలు, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం అని కేసీఆర్ తెలిపారు.