అన్ని రంగాల్లోనూ మహిళలు తమ సత్తా చాటుతున్నారు. సమాజంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అటు ఇంటి పనులకు, ఇటు ఉద్యోగ బాధ్యతలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ఉద్యోగం, సంబంధిత కార్యకలాపాలలో పురుషులతో పాటు మహిళల భాగస్వామ్యమూ పెరిగింది. నిజం చెప్పాలంటే పురుషుల కన్నా ఎక్కువ సమయాన్నే కేటాయిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతల రీత్యా ఇంటి పనులకు కేటాయించే సమయం కాస్త తగ్గినా.. పురుషులతో పోలిస్తే అదీ చాలా ఎక్కువగానే ఉన్నది. ఇవేవే ఊహించి చెబుతున్న విషయాలు కాదు. గతేడాదికి 15-59 ఏండ్ల వయసుగల వారితో జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) జరిపిన ‘టైమ్ యూజ్ సర్వే’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
కావ్య బ్యాంక్ ఉద్యోగం చేస్తోంది. భర్త ఓ పెద్ద కంపెనీలో హెచ్.ఆర్ మేనేజర్. వీరికి ఇద్దరు పిల్లలు. కావ్య తన పనితో బ్యాంక్‌లో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకుంది. ఉదయం ఇంటి పనులు చేసేందుకు ఓ సహాయకురాలిని పెట్టుకుంది. వంట మాత్రం తనే చేసుకుంటుంది. సాయంత్రం బ్యాంక్ నుండి వచ్చిన వెంటనే పిల్లల హౌం వర్క్‌లు, స్నాక్స్, రాత్రి భోజనం, రేపటి కోసం టిఫెన్లు, వంట ఏర్పాటు, బట్టలు మడతపెట్టుకోవడం ఇలాంటి పనులన్నీ పూర్తి చేసుకుంటుంది. భర్త మాత్రం ఎప్పుడో తాపీగా ఇంటికి వచ్చి ప్రశాంతంగా కాసేపు టీవీ చూసి, మరికొంత సేపు ఫోన్ చూసుకొని తినేసి పిల్లలకు హారు, బారు చెప్పి పడుకుంటాడు.
సునీత ఓ బట్టల షాప్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేస్తుంది. ఒక బాబు ఉన్నాడు. భర్త చిన్న కంపెనీలో చిరు ఉద్యోగి. ఉదయం 9 గంటలకు సునీత వెళ్లి షాప్ ఓపెన్ చేయాలి. కనీసం గంట ముందైనా బయలు దేరాలి. అంటే ఎనిమిది గంటకల్లా ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకొని, బాబును స్కూల్ టైం కన్నా అరగంట ముందే అక్కడ వదిలేసి హడావుడిగా వెళ్ళిపోతుంది. భర్త మాత్రం లంచ్ బాక్స్ తీసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. మళ్లీ రాత్రి తొమ్మిది గంటలకు ఇల్లు చేరుతుంది. అప్పటి వరకు బాబును ఆమె తల్లి చూసుకుంటుంది. ఇంటికి వచ్చి రాత్రి వంట, బాబు హౌమ్ వర్క్, రేపటి కోసం ఏర్పాట్లు అంతా మామూలే… ఇలా అన్నింటికీ న్యాయం చేస్తూనే కుటుంబానికీ ఆర్థికంగా తన వంతు అండగా నిలబడుతుంది. కానీ భర్త మాత్రం ఆమెకు ఒక్క పనిలో కూడా సాయం చేయడు.
పైన చెప్పింది కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలైనా.. అంతంత మాత్రం చదువుకొని చిరు ఉద్యోగాలు చేస్తున్నా…అసలు ఏమీ చదవకుండా కూలీ పనులకు పోతున్నా మహిళలందరూ ఇల్లు ఇల్లూ, అటు వృత్తి రెండింటికీ న్యాయం చేస్తున్నారు. అంటే ఏ బాధ్యతనూ విస్మరించకుండా, భారాలన్నీ మోస్తూనే సమాజంలో తామేంటో నిరూపించుకుంటున్నారు. ఈ వాస్తవాలనే ‘టైమ్ యూజ్ సర్వే’ బయట పెట్టింది.
సర్వే జరిగింది ఇలా…
వివిధ పనులపై వ్యక్తులు వెచ్చించిన సమయాన్ని ఈ సర్వే వివరించింది. ఈ సర్వేలో భాగంగా 1,39,487 ఇండ్లను కవర్ చేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 83,247 ఇండ్లు, పట్టణ ప్రాంతాల నుంచి 56,240 ఇండ్లు ఉన్నాయి. ఆరేండ్ల వయసు పైబడినవారు 4,54,192 మంది సర్వేలో పాల్గొన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 2.85 లక్షల మందికి పైగా, పట్టణ ప్రాంతాల నుంచి 1.68 లక్షల మందికి పైగా ఉన్నారు.
రోజుకు 305 నిమిషాలు
ఈ సర్వే ప్రకారం ఏదో ఒక వృత్తిలో భాగస్వామ్యం అవుతున్న మహిళల సంఖ్య పెరిగింది. వృత్తి చేస్తున్న మహిళల సంఖ్య 2019లో 21.8 శాతంగా ఉంటే.. 2024 నాటికి అది 25 శాతానికి చేరింది. అలాగే పురుషులకు సంబంధించి 2019లో 70.9 శాతంగా ఉన్న భాగస్వామ్యం.. గతేడాది 75 శాతానికి పెరిగింది. ఎటువంటి ఆదాయం పొందని ఇంటి సేవలకు మహిళలు వెచ్చించిన సమయం 2019లో రోజుకు 315 నిమిషాలు ఉండగా.. అది గతేడాదికి 305 నిమిషాలకు తగ్గింది. పురుషులతో పోలిస్తే ఇది కూడా చాలా ఎక్కువే అని చెప్పొచు. అంటే మహిళలు ఎలాంటి ఆదాయాన్ని పొందని ఇంటి సేవల నుండి ఉద్యోగ, ఉపాధి కార్యకలాపాల వైపునకు మళ్లారని దీని ద్వారా అర్థమవుతుందని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ తెలియజేస్తోంది.
కుటుంబ సంరక్షణలో ఆమెనే ముందు
కుటుంబాలకు మహిళ ఇచ్చే ప్రాధాన్యం ఎలా ఉంటుందో ఈ సర్వే ద్వారా మరోసారి వెల్లడైంది. ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇంట్లోవారి సంరక్షణ విషయంలో కూడా మహిళల భాగస్వామ్యంతో పాటు వారు వెచ్చించే సమయం కూడా పురుషులతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువగానే ఉన్నది. కుటుంబీకుల సంరక్షణ కోసం మహిళలు 137 నిమిషాలు, పురుషులు 75 నిమిషాలు వెచ్చిస్తున్నారని సర్వే చెబుతోంది. 15 ఏండ్లకు పైబడిన దాదాపు 41 శాతం మంది మహిళలు వారి కుటుంబీకుల సంరక్షణలో పాలు పంచుకున్నారు. ఇది పురుషుల విషయంలో 21.4 శాతం మాత్రమే ఉంది. సంరక్షణ కార్యకలాపాలకు మహిళలు రోజుకు 140 నిమిషాలు కేటాయిస్తే.. పురుషులు మాత్రం 74 నిమిషాలకే పరిమిత మయ్యారు. కుటుంబీకుల సంరక్షణ బాధ్యతను మహిళలే చూసుకుంటున్నారన్న వాస్తవాన్ని ఈ లెక్కలు తెలియజేస్తున్నాయని సంబంధిత మంత్రిత్వ శాఖ అంటుంది.
భాగం పంచుకుంటే…
ఈ సర్వేను సమగ్రంగా పరిశీలించి నపుడు.. ఇంట్లో మగవారు కూడా ఇంటి బాధ్యతల్లో సమభాగం పంచుకుంటే మహిళలు మరింతగా తమ వృత్తుల్లో రాణించడం ఖాయం. ఈ విషయాన్ని మగవారు గుర్తించాల్సిన అవసరాన్ని కూడా ఈ సర్వే తెలియజేస్తోంది. ఏది ఏమైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు ఇలాంటి సర్వేను విడుదల చేసి, మహిళల శ్రమను, నైపుణ్యాన్ని ప్రపంచం గుర్తించేలా చేసిన మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. అలాగే ఇంటి బాధ్యతల విషయంలో కూడా మగవారు భాగం పంచుకు నేలా అవగాహన కల్పించే చర్యలు కూడా చేస్తే మరీ మంచిది. అలాగే ఇంటి పని, కుటుంబంలో వారికి సేవలు చేసే పని కేవలం తమదే అనే భావనలో ఉన్న మహిళల్లో కూడా కొంత మార్పు రావాలని, భర్తల బాధ్యత కూడా ఇందులో ఉంటుం దనే విషయాన్ని గుర్తించాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుందాం…
ఉద్యోగ ఉపాధికి 341 నిమిషాలు
ఈ సర్వే ప్రకారం మహిళలు ఇంటి పనులతో పాటు ఉద్యోగ, ఉపాధి సంబంధిత పనులకూ ప్రాధాన్యతనిస్తున్నారు. 2024లో ప్రజలు ఇందుకు రోజుకు 440 నిమిషాలు వెచ్చించారు. పురుషుల విషయంలో ఇది 473 నిమిషాలుగా ఉండగా.. మహిళలకు సంబంధించి 341 నిమిషాలుగా ఉన్నది. మహిళలు ఇంట్లో వారి కోసం గృహ సేవల్లో రోజుకు 289 నిమిషాలు పని చేశారు. ఇది పురుషుల విషయంలో 88 నిమిషాలే కావటం గమనార్హం.