ఎవరిది పై చేయి!

Whose upper hand!– విమర్శలు.. ప్రతివిమర్శలు
– ఎన్నికల సంగ్రామంలో పార్టీల ప్రచారాల తీరు
– ఓటర్లను ఆకట్టుకోవటానికి అనేక పాట్లు
– ఆరు దశల్లో పలు అంశాల కేంద్రంగా చర్చలు
– ఇందులో రామమందిరం నుంచి అంబానీ-అదానీ వరకు
– తుది అంకానికి ఎన్నికల పండుగ
– నేడు ఏడో దశ.. 57 సీట్లకు పోలింగ్‌
– ఇక అందరి కండ్లూ జూన్‌ 4 మీదే!
భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి కౌంట్‌డౌన్‌ షురూ అయ్యింది. శనివారం జరగనున్న ఓటింగ్‌కు కేవలం 57 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూన్‌ 4న వెల్లడి కానున్న ఫలితాల పైనే అందరి చూపు ఉన్నది. అయితే, ఇప్పటి వరకు ఆరు దశల్లో జరిగిన ఎన్నికల్లో గెలవటం కోసం పార్టీలు అనేక వ్యూహాలతో ముందు కెళ్లాయి. ఇందులో పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, దూషణలు… ఉన్నాయి. మోడీ 172 ప్రచార సభలు నిర్వహిస్తే రాహుల్‌ గాంధీ 107 సభలు, ర్యాలీలకు హాజరయ్యారు. ఈ రెండు పార్టీల వారీగా ప్రచార తీరును పరిశీలిస్తే…ముఖ్యంగా, కుటుంబ పాలన, హిందూ-ముస్లిం విభజన, రామ మందిరం, అంబానీ- అదానీ వంటి వ్యాపార దిగ్గజాల ప్రభావం నుంచి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ నాయకులు తమ ప్రయత్నంలో తీవ్ర ప్రచారం చేశారు.
న్యూఢిల్లీ : భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి కౌంట్‌డౌన్‌ షురూ అయ్యింది. శనివారం జరగనున్న ఓటింగ్‌కు కేవలం 57 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూన్‌ 4న వెల్లడి కానున్న ఫలితాల పైనే అందరి చూపు ఉన్నది. అయితే, ఇప్పటి వరకు ఆరు దశల్లో జరిగిన ఎన్నికల్లో గెలవటం కోసం పార్టీలు అనేక వ్యూహాలతో ముందుకెళ్లాయి. ఇందులో పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, దూషణలు… ఉన్నాయి. మోడీ 172 ప్రచార సభలు నిర్వహిస్తే రాహుల్‌ గాంధీ 107 సభలు, ర్యాలీలకు హాజరయ్యారు. ఈ రెండు పార్టీల వారీగా ప్రచార తీరును పరిశీలిస్తే…ముఖ్యంగా, కుటుంబ పాలన, హిందూ-ముస్లిం విభజన, రామమందిరం, అంబానీ-అదానీ వంటి వ్యాపార దిగ్గజాల ప్రభావం నుంచి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా బ్లాక్‌ నాయకులు తమ ప్రయత్నంలో తీవ్ర ప్రచారం చేశారు.
మూడోసారి గెలుస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. గత పదేండ్లు కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, ఇంకా మరింత రావాల్సి ఉన్నదని ప్రధాని మోడీ ఒక కార్యక్రమంలో తెలిపారు. గత రెండు పర్యాయాలు తాము సాధించిన విజయాలను మోడీ ప్రచారం చేసుకున్నారు. తన ప్రసంగాల్లో రామమందిర ప్రతిష్ట, ఆర్టికల్‌ 370 రద్దు, ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభంలో, బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయే కూటమికి 400కిపైగా సీట్లు రావటమే లక్ష్యంగా మోడీ ”చార్‌ సౌ పార్‌” నినాదాన్ని ప్రతీసారి వినిపించారు. అయితే, కాంగ్రెస్‌ దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తున్నదని ఆరోపించింది.
ఇక కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్న వారసత్వ పన్ను అంశాన్ని మోడీ ఆయుధంగా వాడుకున్నారు. రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ముస్లింలను ఉద్దేశించి..’చొరబాటుదారులు’ అనే పదాన్ని ఉపయోగించారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అలాగే, హిందూ మహిళల నగలను కాంగ్రెస్‌ తీసుకెళ్తుందని తన ప్రచారంలో మోడీ వినిపించారు. అయితే, ముస్లిలంను ఎక్కువ మంది పిల్లలు కనేవారిగా, చొరబాటుదారులుగా వర్ణించారన్న మోడీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. అయితే, మోడీ తన వ్యాఖ్యలపై దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తాను హిందూ ముస్లిం రాజకీయాలు చేయననీ, అలా చేస్తే ప్రజాజీవితానికి అనర్హుడనవుతానని తన వివాదాస్పద వ్యాఖ్యల నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నాన్ని మోడీ చేశాడు.
ఇక ఎలక్టోరల్‌ బాండ్లపై ప్రతిపక్షాలు బీజేపీని తీవ్రంగా విమర్శించాయి. మరోపక్క, రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ షెహజాదా (యువరాజు)గా అభివర్ణించిన మోడీ.. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి అంబానీ, అదానీలపై విమర్శలు చేయడం మానేశారని ఆరోపించారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తల నుంచి పార్టీకి ఎంత ముట్టిందో ప్రకటించాలని రాహుల్‌ గాంధీని మోడీ కోరారు. పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలు స్థిరపడటం, రాష్ట్రంలోని జనాభాను మార్చటానికి ప్రయత్నించటం చేశారని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని మోడీ విమర్శించాడు. లోక్‌సభ ఎన్నికల ఐదో దశకు ముందు పశ్చిమ బెంగాల్‌లో మోడీ మాట్లాడుతూ.. ”పశ్చిమ బెంగాల్‌ సీఎం.. ముస్లిం ఛాందసవాదుల ఒత్తిడితో ఓట్లు పొందటానికి మా సాధువులు, సంస్థల పరువు తీస్తున్నారు. దుర్వినియోగం చేస్తున్నారు” అని అన్నారు. భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ, రామకృష్ణ మిషన్‌, ఇస్కాన్‌పై బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.
బీజేపీపై ప్రతిపక్షాల విమర్శల వెల్లువ
‘ఇండియా’ బ్లాక్‌ ప్రధానంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల ఆదాయం, మైనారిటీ సమస్యలు, ఎన్నికల బాండ్లపై బీజేపీని తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టో న్యాయ పత్రంలో పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కోసం చట్టపరమైన హామీ, ప్రయివేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లతో పాటుగా అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేయటం, ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల కోటాపై 50 శాతం పరిమితిని ఎత్తివేయటం వంటి వాగ్దానాలను చేసింది. ఆర్థిక సర్వేతో పాటు కుల గణన కూడా నిర్వహిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే పేదలకు ప్రతి నెలా ఉచిత రేషన్‌ ఇస్తామని చెప్పారు. రాహుల్‌ గాంధీ పేద మహిళల బ్యాంకు ఖాతాలలో ప్రతి నెలా రూ.8,000 జమ చేస్తానని హామీ ఇచ్చారు. సీఏఏ అంశంపై మౌనం వహించటంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి చిదంబరం.. లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్లమెంటు మొదటి సెషన్‌లో సీఏఏ రద్దు చేయబడుతుందన్నారు.
ఇక లక్నోలో ప్రచారం సందర్భంగా రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ తప్పులు చేసిందని ఒప్పుకున్నారు. అయితే, తన రాజకీయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని అంగీకరించారు. అంతకు ముందు, కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్‌ గాంధీ.. ఎలక్టోరల్‌ బాండ్ల విషయంలో మోడీపై దాడి చేశారు. ”ఎలక్టోరల్‌ బాండ్లను సమర్థించినప్పుడు ప్రధాని మోడీ చేతులు వణుకుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం” అని అన్నారు.
బెయిల్‌పై వచ్చి బీజేపీని ప్రశ్నించిన కేజ్రీవాల్‌
మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అర్ధరాత్రి అరెస్టు చేయటంతో ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలినప్పటికీ.. ఆప్‌ అధినేత మధ్యంతర బెయిల్‌పై విడుదల కావటంతో ప్రచారానికి కొత్త ఊపు వచ్చింది. అప్పటి నుంచి కేజ్రీవాల్‌ కఠినమైన ప్రచారానికి నాయకత్వం వహించి, మోడీపై విమర్శల దాడికి దిగారు. ”ఆయన (మోడీ) వచ్చే సెప్టెంబర్‌లో 75 ఏండ్లు పూర్తి చేసుకుంటున్నారు. 75 ఏండ్లు నిండిన వారు పదవీ విరమణ చేయాల్సిందేనని బీజేపీలో రూల్‌ చేసింది ఆయనే. ఆయన వచ్చే ఏడాది పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. ‘మీ ప్రధాని ఎవరు?’ అని నేను బీజేపీని అడుగుతున్నాను” అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. జేఎంఎం నాయకుడు, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయటంతో ఇండియా బ్లాక్‌ రాజకీయంగా ఎదురు దెబ్బలను చూసిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తమ పార్టీ ఇండియా బ్లాక్‌కు బయటి నుంచి మద్దతిస్తుందనీ, అయితే ఆ సంకీర్ణం తన ఆలోచనని, దానిలో తాను చాలా భాగమని తన వైఖరిని మార్చుకున్నారు.
ఆరు దశల పోలింగ్‌ సరళి ఇలా..
ఎన్నికల సంఘం (ఈసీ) డేటా ప్రకారం.. ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 65.63 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఏప్రిల్‌ 19న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో జరిగిన తొలి దశ పోలింగ్‌లో దాదాపు 66.14 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఏప్రిల్‌ 26న జరిగిన రెండో విడతలో 88 స్థానాలకు ఓటు వేయగా, 66.71 శాతం ఓటింగ్‌ నమోదైంది. మూడో దశ (93 స్థానాలు)లో 65.58 శాతం పోలింగ్‌, మే 13న జరిగిన నాలుగో దశ (96 సీట్లు)లో 67.25 శాతం ఓటింగ్‌ రికార్డైంది. మే 20న జరిగిన ఐదో దశలో 62.15 శాతం, మే 25న 58 నియోజకవర్గాల్లో జరిగిన ఆరో విడత పోలింగ్‌లో 61.01 శాతం ఓటింగ్‌ నమోదైంది.
కాంగ్రెస్‌, బీజేపీలకు ఈసీ నోటీసులు
ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గేలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. మతపరమైన ప్రసంగాలు చేయవద్దని బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లను ఈసీ ఆదేశించింది. అలాగే, రాజ్యాంగాన్ని రద్దు చేయవచ్చని చెప్పటం మానుకోవాలని ప్రతిపక్ష పార్టీ నాయకులను కోరింది.

Spread the love