నవతెలంగాణ-హైదరాబాద్ : గత ఎన్నికల సమయంలో వైసీపీతో ప్రయాణం చేసిన టాలీవుడ్ నటుడు పృథ్వీ… ఆ ఊపులో ఎస్వీబీసీ చైర్మన్ కూడా అయ్యారు. కానీ, ఆ తర్వాత ఓ ఆడియో టేప్ కలకలంతో పదవిని పోగొట్టుకుని, వైసీపీకి దూరం అయ్యారు. ఆ తర్వాత చాలాకాలం పాటు రాజకీయాల జోలికి వెళ్లని పృథ్వీ… జనసేనలో చేరతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో, నటుడు పృథ్వీ వైసీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ వై నాట్ 175 అంటోందని, నిజంగా 175కి 175 స్థానాల్లో విజయం లభించేట్టయితే 92 చోట్ల అభ్యర్థులను ఎందుకు మార్చుతున్నట్టు? అని సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోనుందని పేర్కొన్నారు. ఈసారి టీడీపీ-జనసేన కూటమిదే అధికారం అని పృథ్వీ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 135 ఎమ్మెల్యే స్థానాల్లో. 25 ఎంపీ స్థానాల్లో విజయభేరి మోగిస్తుందని అన్నారు. మరో 100 రోజుల తర్వాత ఏపీలో సుపరిపాలన ప్రారంభం కానుందని పృథ్వీ వ్యాఖ్యానించారు. ఇక, మంత్రి అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ షోలు చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.