– ఇంటింటి ప్రచారం లో ప్రిన్సిపాల్ బృందం
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపకులు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను నేరుగా కలిసి కళాశాల ప్రత్యేకతలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల గురించి వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్లు తెలియజేశారు.
ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం నారంవారిగూడెం గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎ. అనిత, అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. కార్యక్రమంలో పాత నారంవారిగూడెం సర్పంచ్ శ్రీమతి మనుగొండ నాగమణి, పంచాయతీ కార్యదర్శి, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు.



