కులగణనే వద్దన్న ప్రధాని.. బీసీని సీఎం చేస్తారా?

–  సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ”బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి”గా చేస్తామంటూ ప్రకటించడం ప్రజలను మోసగించడమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2021లో జరపాల్సిన జనాభా లెక్కల సేకరణను వాయిదా వేయడమే కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులగణనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపైన, మహిళలపైన దాడులు జరగని రోజు లేదని విమర్శించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో అత్యధికులు వారేనని తెలిపారు. 2014లో ఆకలి సూచీలో 125 దేశాల్లో 104వ దేశంగా ఉన్న భారతదేశం నేడు 111వ స్థానానికి దిగజారిందని పేర్కొన్నారు. దేశంలో పెద్దఎత్తున పేదలు ఆకలికి గురవుతుండగా, వారి సమస్యకు సమూల పరిష్కారం చూపడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణలో వెట్టిచాకిరీ నిర్మూలన కోసం సాగిన సాయుధ పోరాటంతోపాటు, కొమరం భీం ఇచ్చిన ‘జల్‌ జంగల్‌ జమీన్‌’ నినాదాన్ని అమలు చేస్తామంటూ ఇదే సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలను వారి ఖాతాలో వేసుకుని ఎన్నికల సందర్భంగా ఓటర్లను మభ్య పెట్టడానికి తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధికారాలను కల్పిస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తాననే ప్రధాని మోడీ మోసపు ఉపన్యాసాన్ని విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.

Spread the love