ఏచూరి, దేవరాజన్‌ ప్రసంగాలు సెన్సార్‌

– దూరదర్శన్‌, ఆకాశవాణి ‘అధికార నియంతృత్వం’
న్యూఢిల్లీ: సీపీఐ(ఎం) కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు జి.దేవరాజన్‌ ప్రసంగాల్లోని కొన్ని పదాలను దూరదర్శన్‌, ఆకాశవాణిలు తొలగించాయి. ‘మత నియంతృత్వ ప్రభుత్వం, క్రూరమైన చట్టాలు, ముస్లింలు’ వంటి పదాలను వారి ప్రసంగాల నుంచి తీసివేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి దూరదర్శన్‌, ఆకాశవాణిలు అవకాశం కల్పిస్తాయి. ప్రతీ రాజకీయ పార్టీకు కొంత సమయాన్ని ఇస్తాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దూరదర్శన్‌ స్టూడియోలో సీతారాం ఏచూరి ఇచ్చిన టెలివిజన్‌ ప్రసంగం నుంచి రెండు పదాలను తొలగించగా, ‘దివాలా’ ప్రభుత్వం పదాన్ని ‘వైఫల్య’ ప్రభుత్వంగా మార్చారు. అలాగే, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు జి.దేవరాజన్‌ కోల్‌కతాలో చేసిన ప్రసంగంలో నుంచి ‘ముస్లింలు’ అనే పదాన్ని తొలగించారు. ఏచూరి ప్రసంగంలో ఎలక్టోరల్‌ బాండ్ల సూచనలు తొలగించాలని కూడా అధికారులు కోరారు. అయితే తన ప్రసంగంలో తొలగింపులను, సవరణలను పున:పరిశీలించాలని దూరదర్శన్‌ డీజీకి ఏచూరి లేఖ రాసారు. అయితే ఏచూరి అభ్యర్థనను అధికారులు ఆమోదించలేదు. ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఇంతకుముందు కూడా ఇలాంటి చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు. అయితే అధికారులు తీరుపై దేశవాప్యంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూరదర్శన్‌, ఆకాశవాణిలదీ అధికార నియంతృత్వంగా విశ్లేషకులు విమర్శిస్తున్నారు.ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్‌, కేటాయింపు) ఉత్తర్వులు, నిబంధనలు 1968 ప్రకారం ఆరు జాతీయ పార్టీలు, 59 రాష్ట్ర పార్టీలకు దూరదర్శన్‌, ఆకాశవాణిలో ప్రచార అవకాశం కల్పిస్తున్నారు. జాతీయ పార్టీలకు దూరదర్శన్‌ జాతీయ ఛానెల్‌లో కనీసం 10 గంటల సమయం, ప్రాంతీయ దూరదర్శన్‌, ఆకాశవాణి కేంద్రాల్లో కనీసం 15 గంటల సమయం కేటాయిస్తారు. రాష్ట్ర పార్టీలకు ప్రాంతీయ దూరదర్శన్‌, ఆకాశవాణీ కేంద్రాల్లో మొత్తంగా 30 గంటల సమయం కేటాయిస్తారు. రాజకీయ నాయకులు తమ ప్రసంగాలను రికార్డింగ్‌ చేయడానికి కనీసం 4 రోజుల ముందే రాత పూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రసంగాలను అధికారులు ఆమోదించాల్సి ఉంటుంది.

Spread the love