నిన్న రాహుల్… నేడు అఖిలేష్…

నవతెలంగాణ హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతోన్న చర్చలో.. ఎన్డీయే కూటమిపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. సోమవారం ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లోక్ సభలో ఎన్డీయేపై విరుచుకుపడితే.. నేడు లోక్‌సభలో ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్ తొలి ప్రసంగం చేశారు. యూపీ ఫలితాలతో పాటు పేపర్‌ లీక్‌, ఈవీఎంల అంశం గురించి మాట్లాడారు. ‘‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా చెప్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’’ అని అన్నారు. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈవీఎంలపై నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. మాకు యూపీలో 80కి 80 లోక్‌సభ సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇక నీట్‌ అవకతవకలపై మాట్లాడుతూ.. ‘‘అసలు పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది’’ అని మండిపడ్డారు.

Spread the love