– మరోసారి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ
– కళను ప్రదర్శిస్తే.. విమర్శలు తగవు..బెనర్జీ
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరోసారి వార్తల్లో నిలిచారు. పార్లమెంట్ బయట రాజ్యసభ చైర్మెన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ను అనుకరిస్తూ మిమిక్రి చేస్తే..తాజాగా తన పార్లమెంటరీ నియోజకవర్గం శ్రీరాంపూర్‌లో నిర్వహించిన సమావేశంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌తో పాటు ప్రధాని మోడీని కూడా బెనర్జీ అనుకరించారు. ఇక్కడ జరిగిన ర్యాలీలో కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ధన్కర్ తన పదవికి ఉన్న రాజ్యాంగ గౌరవాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఎందుకంటే పదవిపై దురాశతో ప్రధాని మోడీకి లొంగిపోతున్నారు. తనను తాను రైతు కొడుకు అని చెప్పుకునే ధన్కర్‌కు జోధ్‌పూర్‌లో కోట్ల ఆస్తి ఉందని కళ్యాణ్ చెప్పారు. ఢిల్లీలో విలాసవంతమైన ఫ్లాట్‌ని కలిగి ఉన్నారని. రోజూ లక్ష రూపాయల సూటు వేసుకుంటారని ఆరోపించారు.
ప్రధాని మోడీని అనుకరిస్తూ..
పార్లమెంట్ భద్రతకు విఘాతం కలిగించారంటూ ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. కేవలం చరిత్ర పుటల్లో తన పేరును లిఖించేందుకే ప్రధాని మోడీ హడావుడిగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారని, అయితే అందుకు ప్రతిగా ఎంపీల భద్రత విషయంలో రాజీపడ్డారని కల్యాణ్ అన్నారు. ఆ ఇద్దరికి పాస్‌లు జారీ చేసింది ఒక్క బీజేపీ ఎంపీ మాత్రమే. ఆయన్ను కాపాడేందుకు ప్రతిపక్షాలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఉపరాష్ట్రపతిని మిమిక్రీ చేసిన ఘటనను ఓ కళగా అభివర్ణించిన కళ్యాణ్ బెనర్జీ.. ఉపరాష్ట్రపతి చిన్న స్కూల్ పిల్లాడిలా చిన్నపాటి విషయానికే పెడబొబ్బలు పెట్టారని అన్నారు. నా లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉంటానని, మరెవరికీ నేను జవాబుదారీ కానని టీఎంసీ నేత స్పష్టం చేశారు.ఈ సంధర్భంగా ప్రధాని మోడీని అనుకరించారు. నరేంద్ర మోడీ, అమిత్ షాల ప్రభుత్వాన్ని ఎప్పుడు పడగొట్టాలన్న విషయాలను ఏకరువు పెట్టారు.