మానవ పరిపూర్ణ ఆరోగ్యానికి యోగ మేలు

నవతెలంగాణ – రాయపోల్: మానవుడిని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడంలో యోగ ఎంతో ఉపయోగపడుతుందని ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమారి అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రం యోగశాలలో ఆయుష్ డాక్టర్ కిరణ్ కుమారి, వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలలో సిఆర్పి యాదగిరి, వడ్డేపల్లి ఉపాధి కూలీలకు పంచాయతీ కార్యదర్శి రాధ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలంటే యోగా తప్పనిసరి చేయాలని భారతీయులు పూర్వ కాలం నుండి మనకు అందించిన అద్భుతమైన సంపద యోగా అన్నారు. ప్రపంచానికి యోగం నేర్పింది భారతీయులే అన్నారు. మనిషిని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రధాన క్రియలలో యోగ ఒకటి అన్నారు. మనిషిలోని ఆందోళన తగ్గించడంతోపాటు, జీర్ణ వ్యవస్థను, హృదయ స్పందన, నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచేందుకు యోగా దోహదపడుతుందన్నారు. నిత్యం యోగా చేస్తే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ వైద్యాధికారి డాక్టర్ మహారాజ్, వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు, ఉపాధ్యాయులు విద్యాసాగర్, రేఖ, జీనాథ్, ఆయుష్ ఫార్మసిస్ట్ లింగం, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love