Friday, May 15, 2026
E-PAPER
Homeమానవిముందే పసిగట్టొచ్చు…

ముందే పసిగట్టొచ్చు…

- Advertisement -

దంపతుల మధ్య అప్పుడప్పుడూ గొడవలు, భేదాభిప్రాయాలు సహజం. అయితే ఇవి తరచూ జరుగుతున్నా, మీ భాగస్వామి కావాలనే మిమ్మల్ని టార్గెట్‌ చేసి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నా.. ఆ బంధం ప్రమాదకరంగా మారుతోందన్న విషయం గుర్తించాలి. భాగస్వామిలో కనిపించే కొన్ని లక్షణాలు, వారి ప్రవర్తన ఆధారంగా ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం…

భాగస్వామి మనకు తెలియకుండానే మనల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ క్రమంలో మనపై మనకు నమ్మకం కోల్పోయేలా చేస్తారు.. బలహీనులుగా మార్చుతారు. అన్ని రకాలుగా మనల్ని తమ అధీనంలోకి తెచ్చుకునే దాకా నిద్రపోరు. దీన్నే ‘గ్యాస్‌లైటింగ్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు. ప్రతి విషయంలోనూ అబద్ధాలు ఆడడం వేధించే భాగస్వామిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తుంటారు. చిన్న విషయానికే చిరాకు పడడం, కోప్పడడం, అరవడం.. వంటివి వీరి ప్రవర్తనలో ఎక్కువగా గమనించచ్చు. శారీరకంగా, మానసికంగానే కాదు.. భాగస్వామి భావోద్వేగాల పైనా దెబ్బకొడుతుంటారు. కాబట్టి భాగస్వామి మాటలు, చేతల్ని బట్టి వారి హింసాత్మక ధోరణిని పసిగట్టచ్చు.

ప్రతిదీ తప్పన్నట్లుగా చూస్తారు
మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకున్నపుడు మీపై అసూయాద్వేషాల్ని పెంచుకుంటారు. ఇలాంటి వాళ్లకు మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు రుచించవు. ప్రతి విషయంలోనూ మీది తప్పన్నట్లుగా, వారిదే కరక్ట్‌ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తద్వారా మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అనుబంధంలో ముందు మీతో బాగానే వ్యవహరిస్తారు.. మీపై ప్రేమ కురిపిస్తారు. కానీ రానురానూ మీపై ప్రేమ తగ్గిపోవడం, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, మీ కాల్స్‌, సందేశాలకు స్పందించకపోవడం.. వంటివీ ప్రమాద సూచికలే అని అర్థం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన అనుబంధంలో అర్థం చేసుకోవడాలు, సర్దుకుపోవడాలు ఉంటాయి.. కానీ మిమ్మల్ని వేధించాలని చూసే భాగస్వామి ఏ విషయంలోనూ రాజీ పడరు, మీతో ఏకీభవించరు, వాళ్ల మాటే చెల్లుబాటయ్యేలా వ్యవహరిస్తారని అర్థం చేసుకోవాలి.

స్నేహితులు ఉన్నారా..?
ఒక వ్యక్తితో బంధాన్ని ఏర్పరచుకునే ముందు.. వారికి ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఉందో, లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తనకు స్నేహితులు లేరంటే తన వ్యక్తిత్వం అంత మంచిది కాకపోవచ్చనడానికి ఓ సంకేతమని అనుమానించడంలోనూ తప్పు లేదు. ముందు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసి కమిట్‌ అయినా.. ఆ తర్వాత జాగ్రత్తపడమంటున్నారు. ‘అనుమానం పెనుభూతం!’ అంటారు. వేధించే భాగస్వామిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మిమ్మల్ని అనుమానించడం, మీ ఫోన్‌ సంభాషణలు చాటుగా వినడం.. వంటివి చేస్తుంటారు. వీటిని జాగ్రత్తగా గమనించాలి.

సున్నితంగా వివరించాలి
ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు… నేను చూసుకుంటాను అని చెప్పడం కంటే, దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? అని అడగడం ఎంతో మేలు. దీనివల్ల భాగస్వామికి తాము కూడా ఈ బంధంలో ఒక ముఖ్యమైన భాగమనే నమ్మకం కలుగుతుంది. ఒకవేళ వారికి ఆ విషయంపై అవగాహన లేకపోతే, విసుక్కోకుండా సున్నితంగా వివరించాలి. అనుబంధం అంటే కేవలం అవసరాలు తీర్చుకోవడం కాదు, ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం. ఒక వ్యక్తికి తెలిసిన విద్య మరొకరికి తెలియకపోవచ్చు. అంతమాత్రాన వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంట్లో పనులైనా, ఆర్థిక నిర్ణయాలైనా ఇద్దరూ కలిసి చర్చించుకున్నప్పుడే ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

కఠినంగా విమర్శించకండి
భాగస్వామి ఏదైనా తప్పు చేసినప్పుడు అందరి ముందూ లేదా కఠినంగా విమర్శించకండి. బదులుగా వారు చేసే చిన్న పనులను కూడా అభినందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి కావాలని అనుకోకండి. ఒక్కోసారి వెనక్కి తగ్గడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఏ బంధమైనా నిలబడాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం ఉండాలి… అప్పుడే వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.

అనురాగం ముఖ్యం
నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను’, ‘నాకు లోకజ్ఞానం ఎక్కువ’… అనే భావనతో భాగస్వామిని చిన్నచూపు చూస్తుంటారు కొందరు. ఇలాంటప్పుడు ఎదుటివారు చెప్పేది ఎంత ముఖ్యమైనదైనా, అది వినడానికి మనసు అంగీకరించదు. ఒక బంధం బలంగా ఉండాలంటే, ఆధిపత్యం చూపించడం కాదు… అనురాగం ముఖ్యం. ఒకరి విషయాల్లో మరొకరు అనవసరంగా జోక్యం చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనో, ఎదుటివారికి అవగాహన లేదన్న భ్రమతోనో ‘నీకేం తెలియదు’ అంటుంటారు కొందరు. అయితే ఇది తరచూ సాగుతుంటే… భాగస్వామి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -