Sunday, July 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఒక్క కన్నుతో ఎంతో చేశా..ఆరు కండ్లతో ఏమి చేశారు?

ఒక్క కన్నుతో ఎంతో చేశా..ఆరు కండ్లతో ఏమి చేశారు?

- Advertisement -

సీఎం వికృతానందానికి బాడీ షేమింగ్ వ్యాఖ్యలు నిదర్శనం
సీఎం స్థాయి వ్యక్తి
చౌకబారు విమర్శలా?
నా శారీరక లోపం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయదు : మాజీ మంత్రి అజయ్

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
“నాకున్న ఒక్క కన్నుతోనే మంత్రిగా రాత్రింబవళ్లూ పనిచేశాను. సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్‌లను 30 సార్లు స్వయంగా వెళ్లి పర్యవేక్షించాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఊహించని విధంగా అభివృద్ధి చేశాను. ఇప్పుడు మన జిల్లా నుంచే ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా..! ఆరు కండ్లతో వారు చూస్తున్నారు కదా ! నేను ఒక కన్నుతో చేసిన అభివృద్ధిలో కనీసం పదో వంతైనా ఈ మంత్రులు చేయగలిగారా?” అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. చింతకాని మండలంలో జరిగిన ‘రైతు ఆశీర్వాద సభ’లో మాజీ మంత్రిని ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలకు అజయ్ దీటుగా బదులిచ్చారు. ఈ మేరకు శనివారం మమత మెడికల్ కాలేజీలోని తన స్వగృహంలో మీడియా సమావేశంలో అజయ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు మాని, తోటి నాయకుల శారీరక లోపాలను ఎత్తిచూపుతూ ‘బాడీ షేమింగ్’కు పాల్పడటం ఆయన వికృతానందానికి నిదర్శనమని విమర్శించారు.

​​కారు ప్రమాదంలో 32 ఏండ్ల కిందట కన్ను పోయింది..
సీఎం చేసిన ‘ఒంటి కన్ను’ వ్యాఖ్యలపై పువ్వాడ అజయ్ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. 32 ఏండ్ల కిందట కారు ప్రమాదంలో ఒక కన్ను దెబ్బతిని పూర్తిగా పాడైపోయిందన్నారు. ఈ విషయం ఖమ్మం ప్రజలందరికీ తెలుసని, ఈ నిజాన్ని ఎప్పుడూ దాచలేదని చెప్పారు. తనకున్న పరిమితులు ఏమిటో ప్రజలకు ముందే చెప్పి ఎన్నికల్లో పోటీ చేశానని, ఖమ్మం ప్రజలు నన్ను ఆదరించి రెండుసార్లు గెలిపించారని తెలిపారు. శారీరక లోపం తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇంకా జెడ్పీటీసీ స్థాయి ఆలోచనల నుంచి బయటకు రాలేదని, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తర్వాత హుందాగా, విజ్ఞతతో వ్యవహరించాలని హితవు పలికారు. బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం రేవంత్‌కు కొత్తేమీ కాదని.. గతంలో మాజీ మంత్రి జగదీ‌శ్‌రెడ్డి, హరీ‌శ్‌రావు ఎత్తు గురించి, గంగుల కమలాకర్ బరువు గురించి కూడా ఇలాగే చౌకబారు విమర్శలు చేశారని గుర్తుచేశారు. ఎంతసేపూ ఒకరి కన్ను గురించి, పన్ను గురించి, లాగుల గురించి మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు.

​హామీలు నెరవేర్చడానికి ఏ ‘వైకల్యం’ అడ్డొచ్చింది?
రాహుల్ గాంధీ సమక్షంలో ఇదే ఖమ్మం గడ్డపై ఇచ్చిన కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని అజయ్‌ ప్రశ్నించారు. రూ. 4000 పెన్షన్ ? అర్హులైన రైతులందరికీ రుణమాఫీ ఏమైందని అడిగారు. వానాకాలం, యాసంగికి కలిపి ఎకరానికి రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇచ్చారా?, ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం, దళిత బంధు, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. పూర్తి ఆరోగ్యవంతులైన ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి.. ఎన్నికల ముందు ఇచ్చిన ఈ హామీలు నెరవేర్చడానికి ఏ వైకల్యం అడ్డు వస్తోంది? అని నిలదీశారు. రాష్ట్రం భవిష్యత్‌లో తీవ్రమైన కరువు పరిస్థితులను ఎదుర్కోబోతోందని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కక్షతో పక్కనపెట్టి రైతులను శిక్షించొద్దని కోరారు. వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపు చర్యలు పక్కనపెట్టి.. ప్రజా సమస్యలు, తాగు-సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీసీబీ ‌మాజీ ‌చైర్మెన్‌ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్‌ ఆర్జేసీ కృష్ణ, సుడా మాజీ చైర్మెన్‌ బచ్చు విజయ్ కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -