అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్‌డీ

– బ్రోచర్‌ విడుదల చేసిన మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ శివారు ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పించనున్నట్టు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో దానికి సంబంధిత బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో బీఎస్సీ ఫారెస్ట్‌ కోర్సుతో ప్రారంభమైన కళాశాలలో పీహెచ్‌డీ కోర్సును కూడా ప్రవేశపెట్టడం సంతోషదాయకమని అన్నారు. అటవీ విద్యలో దేశంలోనే ప్రఖ్యాత సంస్థగా ఆ కళాశాల నిలవటం గర్వకారణమనిఅన్నారు. త్వరలోనే అది పూర్తి స్థాయి యూనివర్సిటీ హౌదా పొందబోతున్నదని చెప్పారు. కళాశాల డీన్‌ ప్రియాంక వర్గీస్‌ మాట్లాడుతూ ..అక్కడ చదివిన విద్యార్థులు అటవీ విద్యలో సాంకేతిక నిపుణులుగా ఎదగటంతో పాటు, దేశ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా రాణించటం గొప్ప విషయమన్నారు. సిల్వికల్చర ్‌-అగ్రోఫారెస్ట్రీ, ఫారెస్ట్‌ బయోలజీ – ట్రీ ఇంప్రూమెంట్‌, ఫారెస్ట్‌ రిసోర్స్‌ మేనేజ్‌ మెంట్‌, ఫారెస్ట్‌ ప్రోడక్ట్స్‌ యుటిలైజేషన్‌ ఇలా నాలుగు విభాగాల్లో ప్రత్యేక అధ్యయనానికి వీలుగా పీహెచ్‌డీ కార్యక్రమం ప్రారంభం కానున్నదని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్‌, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌ ఆర్‌ఎం.డోబ్రియాల్‌, పీసీసీఎఫ్‌ (ఎఫ్‌ఏసీ) ఎంసీ.పర్గెయిన్‌, ఫారెస్ట్‌ కాలేజీ జాయింట్‌ డైరెక్టర్‌ పీ. శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్‌ ఏ. వెంకటేశ్వర్లు, ఫ్యాకల్టీ డాక్టర్‌ శ్రీధర్‌, డాక్టర్‌ రీజా, తదితరులు పాల్గొన్నారు.

Spread the love