ఆర్గానిక్‌ వివాహం చేసిన రైతుకు అభినందనలు

– చెరుకూరి రామారావుకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆర్గానిక్‌ వివాహం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచిన రైతు చెరుకూరి రామారావుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు రామారావుకు మంత్రి బహిరంగ లేఖ రాశారు. ”మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన మీ కుమారుడు కిరణ్‌ స్వయంగా ఆర్గానిక్‌ ఉత్పత్తులను విక్రయించడం అభినందనీయం. పెళ్లంటే అంగరంగ వైభవంగా ఉండాలనే ఆలోచనలోఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మీ ఆలోచనను గౌరవిస్తూ నూతన దంపతులు ఈ తరహా వివాహానికి ఒప్పుకోవడం యువతలో సమాజంలో ఉన్న సమస్యలపై ఉన్న అవగాహన, బాధ్యతకు నిదర్శనం. మీ కుమారుడు, కోడలి వివాహం వార్త మీడియా ద్వారా తెలుసుకున్నాను. నూతన దంపతులు కిరణ్‌, ఉదయశ్రీలకు నా తరపున హదయపూర్వక శుభాకాంక్షలు….. ”అని తెలిపారు. దశాబ్దాల వాడకం తర్వాత గానీ పురుగు మందులు, ఎరువులతో వ్యవసాయోత్పత్తులు, ప్రజలపై చూపిస్తున్న ప్రభావం ప్రపంచానికి తెలిసి రాలేదని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రసాయనాల ప్రభావంతో ప్రజలకు విపరీతమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రజలు ఆరోగ్యం విషయంలో ఏం కోల్పోయారనే విషయాన్ని కరోనా గుర్తు చేయడంతో ఇటీవల సహజ, సాంప్రదాయ సాగు ద్వారా పండిస్తున్న ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులకు ఆదరణ పెరిగిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రజల్లో చైతన్యం చేస్తున్నదని తెలిపారు.

Spread the love