ఈస్ట్‌జోన్‌ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్

నవతెలంగాణ – హైదరాబాద్
వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా పుల్లా కరుణాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా పనిచేసిన వెంకటలక్ష్మిని కొద్దిరోజుల క్రితం బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె స్థానంలో కరుణాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఆదివారం వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ కార్యాలయానికి చేరుకున్న కరుణాకర్‌ బదిలీపై వెళ్తున్న వెంకటలక్ష్మి నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనను వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఇతర విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పాగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్‌కు చెందిన పుల్లా కరుణాకర్‌ 2010లో గ్రూపు-1 అధికారిగా పోలీసుశాఖలో చేరారు. మొదట ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లా పొద్దుటూరు డీఎస్పీగా పనిచేశారు. అనంతరం తెలంగాణలో షాద్‌నగర్‌, జగిత్యాల పోలీసు సబ్‌ డివిజన్‌తో పాటు సీఐడీ విభాగంలో డీఎస్పీగానూ విధులు నిర్వహించారు. 2017లో అదనపు ఎస్పీగా పదోన్నతిపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలో అదనపు డీసీపీ హోదాలో పనిచేశారు. 2021లో ఎస్పీగా పదోన్నతి పొందాక కరుణాకర్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా పనిచేస్తూ బదిలీపై వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా వచ్చారు.

Spread the love