సైనికుడికి రక్షణ లేకపోతే ఎలా: పవన్‌ కల్యాణ్‌

నవతెలంగాణ – అమరావతి: ఒక సైనికుడిగా దేశ రక్షణ విధుల్లో భాగస్వామి అయిన మోపాడ ఆదినారాయణ తన గ్రామంపై బాధ్యతతో ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనుకుంటే పాలకపక్షం అతనిపై హత్యాయత్నానికి తెగబడటం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ”దేశాన్ని శత్రువుల నుంచి కాపాడిన వ్యక్తి స్థానిక గూండాల నుంచి ప్రాణహానిని ఎదుర్కొంటున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రైతులపాలెంనకు చెందిన ఆదినారాయణపై స్థానిక వైసిపి సర్పంచి సంబంధీకులు తీవ్రంగా దాడి చేస్తే పోలీసులు స్పందించలేదు. హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు కాకుండా సాధారణ దాడిగా కేసు నమోదు చేశారు” అని పవన్‌ అసహనం వ్యక్తం చేశారు.మాజీ సైనికుడు ఆదినారాయణపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. ఒక మాజీ సైనికుడికే రాష్ట్రంలో రక్షణ కల్పించలేకపోతే ఎలా? గతేడాది తిరుపతిలో జనవాణి నిర్వహిస్తే ప్రసాద్‌ అనే సైనికుడు తన భూమిని వైసిపి వాళ్లు కబ్జా చేసి వేధిస్తున్నారని వాపోయాడు. రాష్ట్రంలో సైనికులు, మాజీ సైనికులను ఈ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఈ ఘటనలే తెలియజేస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా రౌతులపాలెంలో మాజీ సైనికుడు ఆదినారాయణపై చోటు చేసుకున్న హత్యాయత్నం ఘటనను కేంద్రీయ సైనిక్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్తాం. ఆయన కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది” అని పవన్‌ కల్యాణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love