పుట్టే బిడ్డను అమ్మకానికి బేరం

– వివరాలు వెల్లడించిన నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన దేవి అనే మహిళ తనకు పుట్టే బిడ్డను పోషించే స్థోమత లేక అమ్మేద్దామని ప్రయత్నించింది. అందుకు దుబ్బ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పని చేస్తున్న ఆశా వర్కర్ సలుంకే జయ అనే మహిళను సంప్రదించింది. ఆమె డబ్బులకు ఆశపడి నిజామాబాద్ నగరంలోని నాగారంకు చెందిన అమీనా బేగంకు, ఆటోనగర్ కు చెందిన షబానా బేగంలకు బిడ్డను అమ్మేందుకు బేరసారాలు మొదలుపెట్టింది. ఆడబిడ్డ పుడితే లక్ష రూపాయలు అని, మగబిడ్డ పుడితే లక్షన్నర రూపాయలని రేటు నిర్ణయించింది. ఆడబిడ్డ పుడితే లక్ష రూపాయలకు అమ్ముతామని అమీనాబేగం, షబానా బేగంల వద్ద రూ.5 వేల చొప్పున అడ్వాన్స్ తీసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోసంగి దేవి మగబిడ్డకు జన్మనివ్వడంతో డెలివరి ఖర్చు కోసం షబానా బేగం నుంచి రూ.20 వేలు తీసుకుంది. ఈ నెల 3న సాయంత్రం నగరంలోని అంబేద్కర్ కాలనీ చౌరస్తాలోని పాత థియేటర్ వద్ద గోసంగి దేవి, ఆశా వర్కర్ సలుంకే జయలు గొడవపడ్డారు. ఈ విషయం తెల్సిన పోలీసులు అక్కడికి చేరుకుని వారిని స్టేషన్ కు రప్పించి విచారించడంతో బిడ్డ అమ్మకం గురించి వెలుగు చూసింది. బిడ్డ అమ్మకానికి మధ్యవర్తిత్వం వహించిన ఆశా వర్కర్ సలుంకే జయ, బిడ్డ తల్లి గోసంగి దేవి, బిడ్డను కొ నుగోలుచేయడానికి ప్రయత్నించిన అమీనా బేగం, షబానా బేగంలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈకేసును చాకచక్యంగా ఛేదించి బిడ్డను అమ్మేందుకు యత్నించిన నలుగురిని అరెస్టులో కీలకపాత్ర పోషించిన నగర సీఐ నరహరి, 3 వటౌన్ ఎస్సై ప్రవీణ్, లను పోలీస్ సిబ్బందిని నిజామాబాద్ ఎసీపీ కిరణ్ కుమార్ అభినందించారు
Spread the love