ఎంసెట్‌లో వెయిటేజీ లేదు

–  ఇంటర్‌లో 45 శాతం మార్కులొస్తేనే అర్హులు
–  ఎంసెట్‌తోనే బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలు
–  28న నోటిఫికేషన్‌ జారీ
–  మార్చి 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

–  ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రి
–  షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ రాతపరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఈ ఏడాది లేదని అన్నారు. కరోనా నేపథ్యంలో గత మూడేండ్లుగా ఈ నిబంధనను వర్తింపచేయ లేదన్నారు. భవిష్యత్తులో వెయిటేజీ ఉంటుందా? లేదా?అన్నది ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా ఉంటుందని వివరించారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదన్నారు. ఇంకోవైపు ఇంటర్‌ బోర్డుతోపాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర రాష్ట్రాలకు చెందిన బోర్డులకు చెందిన విద్యార్థుల మార్కులను క్రోడీకరించి వెయిటేజీ కలిపి ర్యాంకులు కేటాయించడం కొంత కష్టమని అన్నారు. అందుకే ఈసారి వెయిటేజీ ఇవ్వడం లేదన్నారు. ఎంసెట్‌కు దరఖాస్తు చేయాలంటే కనీస మార్కుల నిబంధన అమల్లో ఉంటుందని చెప్పారు. అంటే ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షల్లో 45 శాతం మార్కులుంటేనే ఎంసెట్‌కు దరఖాస్తు చేసేందుకు అర్హులని స్పష్టం చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 70 శాతం, ద్వితీయ సంవత్సరం నుంచి వంద శాతం సిలబస్‌తో ఎంసెట్‌ ప్రశ్నాపత్రాలను రూపొందిస్తామని అన్నారు. కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విజ్ఞప్తి మేరకు ఎంసెట్‌ ద్వారానే బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలుంటాయని వివరించారు. ఇంటర్‌ బోర్డు సూచించిన సిలబస్‌ ప్రకారమే విద్యార్థులు సన్నద్ధం కావాలని కోరారు. ఈనెల 28న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు తుది గడువు ఏప్రిల్‌ పదో తేదీ వరకు ఉందన్నారు. అదేనెల 12 నుంచి 14వ తేదీ వరకు సమర్పించిన దరఖాస్తుల సవరణకు అవకాశముందని చెప్పారు. ఆలస్య రుసుం రూ.250తో ఏప్రిల్‌ 15 వరకు, రూ.500తో అదేనెల 20 వరకు, రూ.2,500తో 25 వరకు, రూ.ఐదు వేలతో మే 2వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు గడువుందని అన్నారు. ఏప్రిల్‌ 30 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం రాతపరీక్షలు మే ఏడు నుంచి తొమ్మిది వరకు, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం రాతపరీక్షలు అదేనెల 10,11 తేదీల్లో నిర్వహిస్తామని వివరించారు. ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో ఒకదానికి దరఖాస్తు చేయాలంటే ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.500, ఇతరులు రూ.900 పరీక్ష ఫీజు చెల్లించాలని కోరారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు రెండింటికీ దరఖాస్తు చేయాలంటే ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.వెయ్యి, ఇతరులు రూ.1,800 కట్టాలని చెప్పారు. ఎంసెట్‌ రాతపరీక్షల నిర్వహణ కోసం తెలంగాణలో 16, ఏపీలో ఐదు కలిపి మొత్తం 21 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 55 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇతర వివరాలకు ష్ట్ర్‌్‌జూర:వaఎషవ్‌. ్‌రషష్ట్రవ.aష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, ఎంసెట్‌ కన్వీనర్‌ బి డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ విజరుకుమార్‌రెడ్డి, పీజీఈసెట్‌ కన్వీనర్‌ బి రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
28న పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌
రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 28న పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు ఏప్రిల్‌ 30 వరకు గడువుందని చెప్పారు. మే రెండు నుంచి నాలుగో తేదీ వరకు సమర్పించిన దరఖాస్తులను సవరించేందుకు అవకాశముందని అన్నారు. ఆలస్య రుసుం రూ.250 తో మే ఐదు వరకు, రూ.వెయ్యితో పది వరకు, రూ.2,500తో 15 వరకు, రూ.ఐదు వేలతో అదేనెల 24వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించొచ్చని సూచించారు. హైదరాబాద్‌, వరంగల్‌లోనే మే 29 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు రాతపరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.600, ఇతరులు రూ.1,100 దరఖాస్తు ఫీజు చెల్లిం చాలని కోరారు. ఇతర వివరాలకు  సంప్రదించాలని సూచించారు.
ఎంసెట్‌ షెడ్యూల్‌

నోటిఫికేషన్‌ జారీ                                            ఈనెల 28న
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం మార్చి         3 నుంచి
వాటి సమర్పణకు తుది గడువు                   ఏప్రిల్‌ 10
రాతపరీక్షల తేదీలు
ఇంజినీరింగ్‌ విభాగం                                    మే 7 నుంచి 9 వరకు
అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగం                       మే 10, 11
తేదీల్లో

Spread the love