కలకోట మేజర్‌కు సాగర్‌ నీరు విడుదల చేయాలి..

–  అన్నదాతలు ఆందోళన  దిగొచ్చిన అధికారులు..
నవతెలంగాణ – బోనకల్‌
కలకోట మేజర్‌కు సాగర్‌ నీటిని విడుదల చేసి ఎండిపోతున్న మొక్కజొన్న పంటను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై రావినూతల – జానకీపురం గ్రామాల మధ్యగల కలకోట మేజర్‌పై ఆదివారం రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ కాలువ కింద పెద్ద బీరవల్లి, జానకీపురం, నారాయణపురం, చిన్న బీరవల్లి గ్రామాలకు చెందిన రైతులు వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. కానీ బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌కి తక్కువ నీటిని విడుదల చేయటంతో కలకోట మేజర్‌కు నీటిని విడుదల చేయటం లేదు. దాంతో సాగునీటి సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని అనేకసార్లు నీటిపారుదల శాఖ అధికారులకు అన్నదాతలు మొరపెట్టుకున్న పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల రైతులు వందమంది రోడ్డుపై ఆందోళనకు దిగారు. నీటిపారుదల శాఖ అధికారులలో చలనం లేకపోవడంతో మండల కేంద్రంలోని నీటిపారుదల శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. దాంతో బోనకల్‌ ఇన్‌చార్జి డీఈ వల్లపు నాగ బ్రహ్మానికి సీపీఐ(ఎం), సీపీఐ మండల కార్యదర్శులు దొండపాటి నాగేశ్వరరావు, యంగళ ఆనందరావు ఫోన్లో సమస్యను వివరించారు. కలకోట మేజర్‌ వద్ద ఏఈ రాజేష్‌ ఉన్నారని అక్కడికి వెళ్లాలని అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాంతో దొండపాటి నాగేశ్వరరావు, ఆనందరావు, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పెద్దపోలు కోటేశ్వరరావు బోనకల్‌ బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద కలకోట మేజర్‌ తూము వద్దకు వెళ్లారు. అక్కడ ఏఈ రాజేష్‌తో వారు చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా కలకోట మేజర్‌కు ప్రస్తుతం 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని ఉన్నతాధికారులు చెప్పడం, నీటిని విడుదల కూడా చేయడంతో అన్నదాతలు తమ ఆందోళన విరమించారు. కలకోట మేజర్‌ కింద సాగు చేసిన మొక్కజొన్న పంటలు మొత్తం తడిసే వరకు నీటిని సరఫరా చేయాలని అన్నదాతలు నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. కార్యక్రమంలో రైతులు రాచబంటి స్వామి, షేక్‌ నాగుల మీర, పోతినేని నరసింహారావు, పెద్దపోలు రామారావు, చిన్నబోయిన నాగేశ్వరరావు, కోనంగి వేణు, రాచ బంటి సైదులు ఆ గ్రామాల రైతుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love