గ్రూప్‌-4కు 7.41 లక్షల దరఖాస్తులు

– మొత్తం 8,180 పోస్టులు
– ఆన్‌లైన్‌లో సమర్పణకు రేపే చివరి తేదీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌ -4 పోస్టులకు భారీగా దరఖాస్తులొస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,41,159 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆన్‌లైన్‌లో గతనెల 30వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశముందని వివరించారు. 25 ప్రభుత్వ శాఖల పరిధిలో గతంలో 8,039 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను గతనెల 30న జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జోతిబాఫూలే వెనుకబడిన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో 141 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను మంజూరు చేసిందని వివరించారు. దీంతో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య గతంలో 289 ఉంటే ప్రస్తుతం 141 మంజూరు కావడంతో వాటి సంఖ్య 430కి పెరిగాయని తెలిపారు. ఇక గ్రూప్‌-4 పోస్టుల సంఖ్య 8,180కు పెరిగాయని పేర్కొన్నారు. ఇతర వివరాలకు https:// www. tspsc.gov.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love