30 నుంచి గ్రూప్‌-4 దరఖాస్తుల స్వీకరణ

జనవరి 19 వరకు సమర్పణ గడువు టీఎస్‌పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌-4 పోస్టులకు ఆన్‌లైన్‌లో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఈనెల 30 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభ మవుతుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.
వాటి సమర్పణకు తుది గడువు వచ్చేనెల 19వ తేదీ వరకు ఉందని వివరించారు. 25 ప్రభుత్వ శాఖల పరిధిలో 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మేలో గ్రూప్‌-4 రాతపరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తామని ప్రకటించింది. ఇతర వివరాలకు www.tspsc.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. గ్రూప్‌-2,3 నోటిఫికేషన్లు సిద్ధం రాష్ట్రంలో గ్రూప్‌-2,3 నోటిఫికేషన్ల విడుదలకు టీఎస్‌పీఎస్సీ కసరత్తును వేగవంతం చేసింది. గ్రూప్‌-2 ద్వారా 783 పోస్టులను, గ్రూప్‌-3 కింద 1,373 పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. గ్రూప్‌-3లో మరో వంద పోస్టులు చేరే అవకాశమున్నది. ఈ రెండు నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ పాలకమండలి ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈనెలాఖరులోపు ఈ రెండు నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నది.

Spread the love