ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌లో వణుకు: టీడీపీ

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఖమ్మం సభతో బీఆర్‌ఎస్‌ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌, తెలుగు మహిళ అధ్యక్షురాలు టి జ్యోత్స్న అన్నారు. ఖమ్మంలో చంద్రబాబు షో చేశారని మంత్రి హరీష్‌రావు మాట్లాడటం సరికాదన్నారు. ఉద్యమ సమయంలో నీ అగ్గిపెట్టే షో వల్ల 12 వందల కుటుంబాలకు చెందిన పిల్లలు చనిపోలేదా అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో సంయుక్తంగా మాట్లాడుతూ ఆ కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, మూడు ఎకరాల భూమి, రూ .10 లక్షల ఎక్స్ప్రెషియా ఇస్తామని చెప్పారనీ, ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. కనీసం అమరవీరుల కుటుంబాలను ఏనిమిదేండ్ల కాలంలో ఆదుకోని మీరు, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా ? అని అడిగారు. మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అని మాట్లాడిన బీఆర్‌ఎస్‌ పార్టీ, మావోయిస్టులకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదని అన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు బీఆర్‌ఎస్‌ దుర్మార్గ పాలనలో జరిగిన విషయం మరిచిపోయారా ? అని అన్నారు.
మీ నాయకుడు తుపాకీ రాముడిలా మా నాయకుడు చంద్రబాబు ఎప్పుడూ మాట్లాడరనీ, చంద్రబాబు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్పారని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లాలో ఏఎంఆర్‌ ప్రాజెక్టు ద్వారా 2004లోపే 506 గ్రామాలకు కృష్ణా జలాల ద్వారా తాగు నీటిని అందించిన చరిత్ర అందరికి తెలిసిన ముచ్చటేనని వ్యాఖ్యానించారు. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్‌ చేశారు. గత ఐదేండ్ల కాలంలో 3055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. సెంటిమెంటు కాలం చెల్లిందనీ, టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా మారినంత మాత్రాన మీ పాపాలు మాసిపోవని అభిప్రాయపడ్డారు.

Spread the love