జీఓ 60 ప్రకారం యూనివర్సిటీల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలివ్వాలి

– తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌
– సీఎస్‌ శాంతి కుమారికి వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల జీఓ 60 ప్రకారం అన్ని యూనివర్సిటీల్లోనూ కనీస వేతనాలివ్వాలని తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆ సంఘం గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెట్టురవి, వి.నారాయణ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న 10 వేల మంది టైమ్‌ స్కేల్‌, డైలీవేజ్‌, ఎన్‌ఎంఆర్‌, కంటింజెంట్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ తదితర నాన్‌టీచింగ్‌ సిబ్బంది సమస్యలను తక్షణమే పరి ష్కరించాలని కోరారు. ఎనిమిదేండ్లు గా వారికి కనీస వేతనాలతో సహా ఏ చట్టబద్ధ హక్కులు కూడా అమలు కావట్లేదనీ, కనీసం జాబ్‌చార్టు కూడా లేదనే విషయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. మూడేండ్లుగా ఏజెన్సీల ద్వారానే నియామకాలు జరుగుతు న్నాని చెప్పారు. ఇచ్చే అరకొర వేతనాల్లోనూ ఏజేన్సీలు పర్సంటేజీలు తీసుకుంటూ కార్మికుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయని వాపోయారు. పది గంటలు పనిచేయిస్తున్నారనీ, మహిళా ఉద్యోగులను కొన్ని చోట్ల వేధిస్తున్నారని తెలిపారు. ఓయూలో టైం స్కేలు గ్రూపు-డి ఉద్యోగికి రూ.31 వేలు ఇస్తుండగా…అదే శాతవాహన వర్సిటీలో రూ.26వేలు ఇస్తున్నారన్నారు. హాస్టళ్లలో పనిచేసే వంట మనుషులకు రూ.10వేలు, హెల్పర్లకు రూ.8వేలు, అటెండర్లకు రూ.16వేలు, గార్డెన్‌ వర్కర్లకు రూ.13 వేలు ఇస్తున్న తీరును వివరించారు. యూనివర్సిటీల్లో నాన్‌ టీచింగ్‌ డైలీవేజ్‌, ఎన్‌ఎంఆర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ తదితర సిబ్బందికి రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇస్తున్న మూల వేతనాన్ని కనీస వేతనంగా చెల్లించేలా ఆదేశాలి వ్వాలని విజ్ఞప్తి చేశారు. పదేండ్ల సర్వీస్‌ దాటిన వారిని టైం స్కేల్‌ ఉద్యోగులు గా గుర్తించాలని కోరారు. ఈపిఎఫ్‌, ఈఎస్‌ఐని అన్ని యూనివర్సిటీల్లోనూ అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు. కాంట్రాక్టర్‌ మారితే సిబ్బందిని తగ్గించే విధానాన్ని మానుకోవాలన్నారు. రిటైర్డ యిన సిబ్బందికి రూ.5 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలని విన్నవించారు. గుర్తింపు కార్డులివ్వా లనీ, బస్సుపాస్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. గ్రాట్యుటీ, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళా ఉద్యోగులకు 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love