అర్ధరాత్రి హైవేపై..దొంగల ముఠా హల్‌చల్‌

– రెండు రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు
– కారు వదిలి పారిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ దుండగులు
నవతెలంగాణ-డిచ్‌పల్లి
అర్ధరాత్రి వేళ.. 44వ జాతీయ రహదారిపై దొంగలముఠా హల్‌చల్‌ చేసింది. కొన్ని రోజులుగా వ్యవసాయ క్షేత్రాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ కాయిల్స్‌, కాపర్‌ వైర్‌లను దొంగిలిస్తున్న ముఠా.. వస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌ వాయి టోల్‌ప్లాజా వద్ద అర్ధరాత్రి వేళ కాపు కాశారు. బారీ కేడ్‌లను పెట్టి తనిఖీలు చేపట్టగా.. ఒక కారు వేగంగా వచ్చి బారికేడ్‌లను ఢకొీట్టి వెళ్తుండగా.. పోలీసులు రెండు రౌండ్‌లు కాల్పులు జరిపారు. కొద్ది దూరం వరకు వెళ్లిన దుండగులు కారును వదిలేసి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌వైర్‌ను దొంగల ముఠా చోరీకి పాల్పడుతోంది. జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు సైతం నమోదు కావడంతో పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగిన దొంగతనాల్లో ఒక కారును పోలీసులు అనుమానించారు. ఆ కారు ఆదివారం రాత్రి ముప్కాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంచరిస్తున్నట్టు అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించి అలర్ట్‌ చేశారు. దానిలో భాగంగానే టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌, ధర్పల్లి సీఐతో పాటు డిచ్‌పల్లి, ఇందల్వాయి, జాక్రన్‌ పల్లి, దర్పల్లి ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బందితో కలిసి ఇందల్‌వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల సమయం లో రాజస్థాన్‌కు చెందిన కారు వస్తుండటంతో గమనించిన ధర్పల్లి ఎస్‌ఐ వంశీ కృష్ణారెడ్డి కారుని ఆపే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న బారీకేడ్‌లను కారు ఢకొీట్టుకుంటూ వెళ్లిపోయింది. వెంటనే ఎస్‌ఐ గాల్లో రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అలర్టయ్యారు. కారును పట్టుకోవడానికి పోలీసులు ఛేజ్‌ చేయగా.. నిందితులు సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మల్లుపేట్‌ వద్ద కారు వదిలేసి నలుగురు దుండగులు పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు టీమ్‌లుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజస్థాన్‌ దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సదాశివనగర్‌ మండలంలోని మల్లుపేట వద్ద కారును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన కొద్దిసేపటికి పోలీసులు మల్లుపేట చేరుకొని కారును స్వాధీనం చేసుకొని ఇందల్‌వాయి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ధర్పల్లి ఎస్‌ఐ వంశీకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ముఠాపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి
సదాశివనగర్‌ : మండలంలోని మల్లూపేట్‌ గ్రామ శివారులో ఆదివారం రాజస్థాన్‌ దొంగల ముఠా కారును వదిలి పారిపోయారు. దుండగులను పట్టుకునేందుకు ఇందల్‌వాయి టోల్‌గేట్‌ నుంచి పోలీసులు చేజ్‌ చేస్తుండగా.. వారు కారును సదాశివనగర్‌ మండలం మల్లుపేట్‌ గ్రామ శివారులో వదిలిపారిపోయినట్టు ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు. గ్రామస్తులు, సర్పంచ్‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Spread the love